Priyanka Gandhi: " దేశ ఆస్తులను ప్ర‌ధాని త‌న స్నేహితుల‌కు అమ్మేస్తున్నారు"

By Rajesh KFirst Published Aug 5, 2022, 7:37 PM IST
Highlights

Priyanka Gandhi: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జీఎస్టీ పెంపు వంటి సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ఎంపీలు ప్రధాని మోదీ నివాసాలకు ర్యాలీగా వెళ్లి నిరసన చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.  

Priyanka Gandhi: దేశ ఆస్తులను ప్ర‌ధాని మోదీ తన స్నేహితులకు అమ్మేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇలాంటి అనైతిక‌ చ‌ర్య‌ల‌పై ఎలాంటి చర్యలు తీసుకోరా? ఎలాంటి ద‌ర్యాప్తు చేయ‌రా? అని ప్ర‌భుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, జీఎస్టీకి వ్యతిరేకంగా నిర‌స‌న‌ ప్రదర్శనలు చేప‌ట్టింది. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాసాలకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపేందుకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నించారు. అయితే.. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.  

ఈ క్ర‌మంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతున్న ప్రియాంక గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లో ఎక్కించారు. వ్యాన్‌లో కూర్చున్న ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ప్ర‌ధాని మోడీకి దేశంలో  ఏర్ప‌డిన‌ ద్రవ్యోల్బణం కనిపించడం లేద‌నీ, ప్రధాని నివాసానికి నడిచి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ను చూపి ద్రవ్యోల్బణాన్ని చూపాలని ఎద్దేవా చేశారు.

ద్రవ్యోల్బణ విష‌యంలో కేంద్రంపై ప్రియాంక గాంధీ విరుచుక‌ప‌డ్డారు. అధికార‌ బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే.. వారిని అణచివేయాల‌ని ప్రభుత్వం భావిస్తోందని, వారి ఒత్తిడికి తలొగ్గి రాజీకి మౌనంగా కూర్చుంటాం.. అయితే మేం ఒక ప్రయోజనం కోసమే వచ్చామని అన్నారు.  బీజేపీ మంత్రులకు ద్రవ్యోల్బణం కనిపించడం లేదని, అందుకే ప్రధాని నివాసానికి పాదయాత్ర చేసి ద్రవ్యోల్బణం చూపాలన్నారు. క్ర‌మంగా  గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వంట గ్యాస్ ను ఎవరూ కొనుగోలు చేయలేకపోతున్నారని, ద్రవ్యోల్బణం వ‌ల్ల‌ పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రంపై ప్రియాంక గాంధీ విరుచుక‌ప‌డ్డారు. 

కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు  వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేడు  ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిర‌స‌న‌ ప్రదర్శనలు చేప‌ట్టింది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌లను ఘెరావ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ప్ర‌భావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసన లేదా రహదారిపై గుమికూడేందుకు ప్రయత్నించిన  నాయ‌కులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా మొత్తం 64 మంది ఎంపీలు, ఇతర కార్యకర్తలు, సీనియర్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ త‌రుణంలో ఢిల్లీ వీధులను కంటోన్మెంట్లుగా మార్చారు. ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా మోహరించారు. వాటర్ క్యానన్లతో కార్లు కూడా చుట్టూ పార్క్ చేయబడ్డాయి.  అయితే పోలీసు కాపలా కూడా పటిష్టంగా ఉంది. పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా తన కార్యకర్తలతో ముందుకు వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన‌ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో..  ఆమె ఒక మహిళా పోలీసు చేతిని పట్టుకుని కనిపిస్తుంది. కానీ, బీజేపీ నేత‌లు దాడి చేసిన‌ట్టు తమను వక్రీకరించారని ప్రియాంక ఆరోపించారు.

మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో శుక్రవారం ఈడీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల‌ను  ప్రశ్నించింది. అలాగే హెరాల్డ్‌ భవనంలో కొంత భాగాన్ని సీజ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.  
 

click me!