కాంగ్రెస్ నాయకులకు మతిపోయింది.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్..

By Sumanth KanukulaFirst Published Apr 28, 2023, 4:42 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై వివాదస్పద  వ్యాఖ్యలు చేశారు. మోదీ ఒక విషసర్పం లాంటి వ్యక్తి అని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై వివాదస్పద  వ్యాఖ్యలు చేశారు. మోదీ ఒక విషసర్పం లాంటి వ్యక్తి అని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మతిభ్రమించిందని విమర్శించారు. ప్రపంచం మొత్తం ప్రధాని మోడీని స్వాగతిస్తోందని.. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రం ఆయనను విషసర్పం అని పిలుస్తున్నారని మండిపడ్డారు. మోదీని ఎంత తిడితే కమలం అంత బాగా వికసిస్తుందని అన్నారు. 

కర్ణాటకలోని ధార్వాడ్ జిల్ా నవల్‌గుండ్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌కు మాట్లాడటానికి సమస్యలు లేవు. గత తొమ్మిదేళ్లలో, ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచారు. ఆయన భారతదేశం అభివృద్ధి చెందడానికి పనిచేశారు. భారతదేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేశారు. భారతదేశ సరిహద్దులను సురక్షితంగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలు ‘మోదీ-మోదీ’ నినాదాలతో స్వాగతం పలుకుతున్నారు’’ అని అన్నారు. 

Latest Videos

‘‘ప్రపంచమంతా గౌరవించే, స్వాగతించే మా నాయకుడు మోదీ విషపూరిత పాములాంటివాడని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తారా?’’ అని సభకు హాజరైన ప్రజలను అమిత్ షా అడిగారు. ప్రధాని మోదీని దుర్భాషలాడడం ద్వారా కాంగ్రెస్ కర్ణాటక ప్రజలను రెచ్చగొట్టడం సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. మోదీని దుర్భాషలాడితే ఆయనకు మద్దతు పెరుగుతుందని  చెప్పారు. 

‘‘కాంగ్రెస్.. మోదీ తేరీ ఖబర్ ఖుదేగీ (మోదీ, మీ సమాధి తవ్వబడుతుంది) అనే నినాదాన్ని ఇస్తుంది. సోనియా గాంధీ ‘మౌత్ కా సౌదాగర్ (మరణాల వ్యాపారి)’ అని, ప్రియాంక గాంధీ ‘నీచీ జాతి కే లోగ్ (అధో స్థాయి ప్రజలు)’ అని అన్నారు. ఇప్పుడు  ఆయన (మిస్టర్ ఖర్గే) 'విశేల సంప్' (విషపూరిత పాము) అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు మతి పోయింది. మోదీని ఎంత దూషించినా కమలం వికసిస్తుంది’’ అమిత్ షా అన్నారు. 

ఇదిలా ఉంటే, కర్ణాటకలోని కలబురగిలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఒక విషసర్పం లాంటి వారు. ఇప్పుడు నేను విషపూరితమైన పాముతో పోల్చినందుకు మీరు విషాన్ని పరీక్షించాలనుకుంటే.. అది మీ మరణానికి దారి తీస్తుంది జాగ్రత్త’’ అని కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనంలో ఉందని.. అందుకే ఆ పార్టీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. 

అయితే ఈ క్రమంలోనే స్పందించిన ఖర్గే.. తన మాటలు ప్రధాని మోదీని ఉద్దేశించినవి కాదని, బీజేపీని ఉద్దేశించినవి అని అన్నారు. ‘‘బీజేపీ విషసర్పం లాంటిదని నా ఉద్దేశ్యం. ఎవరైనా రుచి చూసినా మరణం ఖాయం. ఈ మాటలు మోదీని ఉద్దేశించి కాదు. వ్యక్తిగతంగా నాకు ఏ వ్యక్తిపైనా పగ లేదు’’ అని ఖర్గే వివరణ ఇచ్చారు. 
 

click me!