
న్యూఢిల్లీ: తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో ఈ భేటీ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. అలాగే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించి అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ చేశారు.
కొందరు బీజేపీ నేతలు ఇప్పటికే ముందస్తు గురించి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలను బీజేపీ అధిష్టానం ముందు లేవనెత్తారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, స్టేట్ ఇంచార్జీ తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, నేషనల్ జనరల్ సెక్రెటరీ సునీల్ బన్సల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, సుధాకర్ రెడ్డి, కే లక్ష్మణ్, జీ కిషన్ రెడ్డి, విజయ శాంతి సహా పలువురు హాజరయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వం గురించి ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడంపై వ్యూహరచన పై చర్చలు జరిపినట్టు సమాచారం. అంతేకాదు, ఆ ఎన్నికలో ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఆ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పరిచయం ఉన్నవారి గురించి ఎలా హైలైట్ చేయాలి? అనే అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. సీబీఐ ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను విచారించింది. ఆమెకు సీఏగా పని చేసిన బుచ్చిబాబు గోరంట్లను అరెస్టు చేసింది.
Also Read: ఏషియానెట్ న్యూస్ ఇంప్యాక్ట్: గాల్వన్ లోయ అమరజవాను స్మారకం కోసం కుటుంబం పోరాటం.. సహకరిస్తామన్న ఆర్మీ
తెలంగాణలో సునీల్ బన్సాల్ సుమారు వారం పాటు గడిపారు. వీధుల్లో సుమారు 11 వేల భేటీలు జరపాలని, అక్కడ పబ్లిక్ రెస్పాన్స్‌ను పట్టుకోవాలని టార్గెట్ ఇచ్చారు. ఈ టార్గెట్ ఇవ్వాళ్టితో ముగిసింది. కాబట్టి, ఈ సమావేశాల నుంచి వచ్చిన ఔట్‌కమ్‌ను సునీల్ బన్సల్ ఈ సమావేశంలో వారికి తెలియజేసినట్టు అర్థం అవుతున్నది.
ఈ సమావేశంలో తెలంగాణ నేతలు వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, జీ మోహన్ రావు, మురళీధర్ రావులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముందు అమిత్ షా, జేపీ నడ్డా, తరుణ్ చుగ్‌లు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు.