మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఉదయం జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir ) చేరుకున్నారు. కశ్మీర్ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మరియు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వాగతంపలికారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఉదయం జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir ) చేరుకున్నారు. కశ్మీర్ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మరియు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వాగతంపలికారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. తన పర్యటనలో భాగంగా అమిత్ షా.. ఇటీవల ఉగ్రదాడుల్లో మరణించిన సాధారణ పౌరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. శనివారం శ్రీ నగర్-షార్జాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును అమిత్ షా ప్రారంభించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో భద్రత అంశాలకు సంబంధించి సెక్యూరిటీ ఏజెన్సీల ఉన్నతాధికారులతో Amit Shah చర్చలు జరపనున్నారు.
ముఖ్యంగా సరిహద్దుల నుంచి పెరిగిన చొరబాట్లపై ఆయన భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్, సీఆర్‌పీఎఫ్ చీఫ్, ఎస్‌ఎస్‌జీ చీఫ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు.. భద్రతా సంబంధిత సమస్యలపై అమిత్ షాతో జరిగే చర్చల్లో పాల్గొంటారు.
ఆదివారం అమిత్ షా జమ్మూ వెళ్లనున్నారు. అక్కడ జన్ సంవాద్ బహిరంగా ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తారు. అదే రోజు తిరిగి శ్రీనగర్ చేరుకుంటారు. అంతేకాకుండా తన పర్యటనలో భాగంగా సోమవారం.. అమిత్ షా గ్రామ సర్పంచ్‌ల సమస్యలను పరిష్కరించడం కోసం వారిని కలిసే అవకాశం ఉంది. అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమిత్ షా పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు శుక్రవారం సోదాలు నిర్వహించాయి. డ్రోన్‌లు, మోటర్‌బోట్‌లతో పహారా కాస్తున్నారు. శ్రీనగర్‌లో అనుమానస్పద కదలికలపై నిఘా ఉంచడానికి డ్రోన్లను వినియోగించుకుంటున్నారు. అదే విధంగా దాల్ సరస్సు, జెహ్లం నదిలో సీఆర్‌పీఎఫ్ మోటార్ బోట్‌లతో నిఘా ఉంచారు.
‘కొన్ని ప్రాంతాల్లో స్నిపర్లను, షార్ప్ షూటర్‌లు మోహరించాం. భద్రత సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాదచారులను కూడా తనిఖీ చేస్తున్నారు. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు.. వారి భద్రత కోసం కూడా’ సీఆర్‌పీజీ డిప్యూటీ ఇన్స్ప్‌క్టర్ జనరల్ Mathew A John ఓ ఆంగ్ల మీడియాకు చెప్పారు. ఉగ్రదాడులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా పట్టణ కేంద్రం, లాల్ చౌక్ మీదుగా మైనార్టీలు నివసించే ప్రాంతాలపై వైమానిక నిఘా ఉంచాయి.
ఇటీవల మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై, ఉపాధి కోసం వచ్చిన కూలీలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టుగా సీఆర్‌పీఎఫ్ డీఐజీ అన్నారు. మఫ్టీలో ఉన్న అధికారులు శ్రీనగర్‌లో అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాదులను, వారికి సాయం చేసేవారిని గుర్తించేందుకు వీరు పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు, 15 బీఎస్‌ఎఫ్ టీమ్స్‌ను శ్రీనగర్‌లో మోహరించినట్టుగా ఆయన తెలిపారు.