రైతు సంఘాలకు కేంద్రం నుంచి పిలుపు.. ‘చర్చలు సఫలమైతే ఆందోళన విరమిస్తాం’

By Pratap Reddy KasulaFirst Published Dec 4, 2021, 7:05 PM IST
Highlights

రైతు సంఘాల నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి ఫోన్ చేసినట్టు తెలిసింది. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి రైతులు ఒక కమిటీ రూపంలో రావాలని సూచనలు చేసినట్టు రైతు నేతలు వివరించారు. ఆయన సూచనల మేరకే ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను సమీక్షించడానికి ఈ నెల 7వ తేదీన మరోసారి భేటీ అవుతామని సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో సమావేశం సజావుగా సాగి తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరిస్తే తాము ఆందోళనలు విరమిస్తామని రైతులు చెబుతున్నారు.
 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో(Delhi Border) ధర్నా చేస్తున్న రైతుల(Farmers)కు కేంద్ర ప్రభుత్వం(Union Government) నుంచి పిలుపు వచ్చింది. శుక్రవారం రాత్రి రైతు ఆందోళనకారులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఫోన్ చేసినట్టు సమాచారం వచ్చింది. ఇప్పటికే మూడు సాగు చట్టాల రద్దు డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం స్వీకరించి వాటిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మూడు సాగు చట్టాల రద్దుతో పాటు రైతులు లేవనెత్తిన కనీస మద్దతు ధర డిమాండ్‌పైనా చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి రైతులను ఒక కమిటీగా ఏర్పడి చర్చించడానికి రావాలని సూచన చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకే రైతులు ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ఈ రోజు వెల్లడించింది. అంతేకాదు, ఆ చర్చలు సఫలం అయితే, తాము ఆందోళనలు వదిలి ఇంటికి వెళ్లిపోతామనీ వెల్లడించడం గమనార్హం.

కనీస మద్దతు ధర డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు యుధ్‌వీర్ సింగ్ వెల్లడించారు. ఈ కమిటీలో శివకుమార్ కక్కా, బల్బీర్ సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, గుర్నామ్ సింగ్ చాదుని, యుధ్‌వీర్ సింగ్ ఉన్నారు. అమిత్ షా తమకు శుక్రవారం రాత్రి ఫోన్ చేసినట్టు యుధ్‌వీర్ సింగ్ తెలిపారు. మూడు సాగు చట్టాలను రద్దు చేశామని ఆయన పేర్కొన్నట్టు వివరించారు. అంతేకాదు, రైతు సంఘాల ధర్నాను ముగించడానికి తాము పరిష్కారాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారని అన్నారు. అందుకోసం రైతులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలిపారు. అందుకోసం రైతులు ఒక కమిటీగా కేంద్రాన్ని సంప్రదించాలని సూచనలు చేసినట్టు వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకే తాము ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Also Read: రైతు ఉద్యమం ఆగదు.. పెండింగ్ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..

కేంద్ర ప్రభుత్వంతో రైతు నేతల సమావేశంలో చర్చించిన అంశాలపై డిసెంబర్ 7వ తేదీన తాము అంతర్గతంగా మరోసారి చర్చించుకుంటామని యుధ్‌వీర్ సింగ్ వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీ నాటి సమావేశంలో రాజీ అంశానికి మద్దతు లభిస్తే అప్పుడు రైతులు ఢిల్లీ సరిహద్దులు విడిచి వెనక్కి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నిర్ణయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు సింఘు సరిహద్దులో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో తీసుకున్నారు. 

Also Read: నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు:రాష్ట్రపతి ఆమోదం

మూడు సాగు చట్టాల రద్దుతోపాటు రైతు ఆందోళనకారులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కావాలని డిమాండ్ చేశారు. దీనితోపాటు ఎలక్ట్రిసిటీ బిల్లు 2020ని రద్దు చేయాలని, పంట వ్యర్థాలను కాల్చడానికి ప్రత్యామ్నాయం చూపించాలని రైతులు అడుగుతున్నారు. అలాగే, ఆందోళన కాలంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని, ఇదే కాలంలో రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లన్నీ పరిష్కృతమయ్యే వరకు తాము ఆందోళనలు వీడే ప్రసక్తే లేదని ఇది వరకే రైతు నేతలు స్పష్టం చేసి ఉన్నారు.

click me!