
కన్నపిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు. అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. ఇలాంటి త్యాగానికి ప్రతిరూపమైన ఓ సంఘటనే మైసూరులో జరిగింది.
కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఓ తండ్రి విలవిలలాడిపోయాడు. అతని వైద్యానికి కావాల్సిన మందుల కోసం 300కిలో మీటర్లు వెళ్లాలి. లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ సరిగా లేదు. ఏం చేయాలో తోచలేదు.
అలాగని కొడుకును చూస్తూ బాధపడుతూ ఉండలేడు. అందుకే సాహసం చేశాడు. తనకున్న సైకిల్ మీదే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
తండ్రి ప్రేమకు హద్దులు లేవని చాటే ఈ అపురూప ఘటన మైసూరు జిల్లా టి. నరిసిపురలో చోటు చేసుకుంది. ఆనంద్(45) అనే వ్యక్తి తన పదేళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం తన గ్రామానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమ్హాన్స్ కు సైకిల్ మీద వెళ్లి మందులు తీసుకుని తిరిగి వచ్చాడు.
అయితే ఆనంద్ కొడుకు దివ్యాంగుడు. అతను ఇటీవల జబ్బుపడ్డాడు. డాక్టర్లు రాసిన మందులు మైసూరులో దొరకలేదు. లాక్ డౌన్ కావడంతో బెంగళూరుకు వెళ్లడానికి ఎటువంటి రవాణా వసతులు లేవు. దీంతో సైకిల్ నే ఆశ్రయించాడు ఆ తండ్రి.