
న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టులో ఆఫ్గనిస్తాన్(Afghanistan)లో రాజకీయం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న ప్రజలు ఎన్నుకున్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయింది. రెండు దశాబ్దాలుగా విధ్వంసం సృష్టిస్తూ వచ్చిన తాలిబాన్లు(Taliban) అధికారాన్ని చేబట్టారు. సరిగ్గా ఈ పరిణామానికి ముందే హడావుడిగా అమెరికా సైన్యం(American Troops) వెనక్కి మళ్లింది. ఆగస్టు కల్లా అమెరికా సైన్యం ఉపసంహరణపై ముందస్తుగా ఒప్పందం కుదిరింది. కానీ, అది సాధ్యం కాకపోవడంతో మరికొంత కాలం తీసుకుని వేగంగా సైన్యం వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. కానీ, అప్పుడు అమెరికా సైన్యం చాలా వరకు వారి ఆయుధ సామగ్రిని అక్కడే వదిలిపెట్టి వెనుదిరిగి వెళ్లిపోయింది. అధికారాన్ని హస్తగతం చేసుకుని విర్రవీగుతున్న తాలిబాన్లకు అధునాతనమైన అమెరికా యుద్ధ సామగ్రి, ఆయుధాలు, హంవీ వాహనాలు(US Weapons) కూడా దక్కాయి.
అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతుందనే చర్చ అప్పట్లోనే మొదలైంది. అక్కడ తాలిబాన్లు గద్దెనక్కగానే పాకిస్తాన్ దాదాపు బహిరంగంగానే దానికి మద్దతు ప్రకటించింది. తాలిబాన్లకు తెరవెనుక పాకిస్తాన్ సహకరిస్తుందని అప్పటికే చాలా మందిలో అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భయాలే నిజం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని టెర్రరిస్టులే కాదు.. అక్కడ అమెరికా వదిలిపెట్టి వెళ్లిపోయిన ఆయుధాలు ఇప్పుడు భారత పొలిమేరల్లోకి(Kashmir) వస్తున్నాయి. ఈ విషయాన్ని మేజర్ జనరల్ చాంద్‌పురియా ధ్రువీకరించారు.
అక్రమంగా భారత సరిహద్దులోకి చొరబాటు చేస్తున్న ఉగ్రవాదులను ఆర్మీ విజయవంతంగా అడ్డుకుంది. వారిని మట్టుబెట్టింది. అయితే, వారి దగ్గర లభించిన ఆయుధాలు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలి వెళ్లిపోయిన ఆయుధాలు ఆ మరణించిన ఉగ్రవాదుల నుంచి రికవరీ చేసుకున్నట్టు మేజర్ జనరల్ చాంద్‌పురియా తెలిపారు.
ఎల్‌వోసీ దగ్గర మట్టుబెట్టిన ఉగ్రవాదుల దగ్గర లభించిన ఆయుధాలు ఎప్పుడూ సాధారణంగా లభించేవి కావని ఆయన వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలిపెట్టి వెళ్లిపోయిన ఆయుధాలే ఇవి అని తెలిపారు. మా విశ్లేషణల ప్రకారం, జమ్ము కశ్మీర్‌కు కేవలం ఉగ్రవాదులే కాదు.. ఆయుధాలు వస్తున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలిపెట్టి వెళ్లిన ఆయుధాలు పాకిస్తాన్ గుండా జమ్ము కశ్మీర్‌లోకి వచ్చే ముప్పు ఉన్నదని ఆయన హెచ్చరించారు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షిర్‌లో ఇప్పటికీ స్థానికుల ధిక్కారం కొనసాగుతూ ఉన్నట్టే కనిపిస్తున్నది. ఇందుకు తాజాగా అక్కడ హింసాత్మక ఘర్షణలు జరిగినట్టు బయటకు వచ్చిన వార్తే నిదర్శనం. పంజ్‌షిర్‌లో కొన్ని చోట్ల ఇంకా మైన్‌లు పాతిపెట్టినట్టు తెలుస్తున్నది. అలాంటి ఓ మైన్‌ను ఢీకొట్టిన తాలిబాన్ వెహికల్ పేలిపోయింది. దీంతో స్థానికులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. పంజ్‌షిర్ ప్రావిన్స్‌లోని పరందేహ్ లోయ చుట్టూ తాలిబాన్లు మోహరించారు. చాలా మంది స్థానికులను అరెస్టు చేసినట్టు స్థానిక వర్గాలు కొన్ని చెప్పాయి. ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఇక్కడ సాయుధ ఘర్షణలు జరుగుతున్నట్టు వివరించాయి.