
పాట్నా: పశ్చిమ బెంగాల్(West Bengal) అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి తృణమూల్ కాంగ్రెస్(TMC)కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) సేవలు అందిస్తున్నారు. కానీ, ఇటీవలే ఆ పార్టీలో మమతా బెనర్జీ(Mamata Banerjee), ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వర్గాల మధ్య వైరం ముదిరిందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ టీఎంసీ నేత ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఐపీఏసీ టీమ్‌పై ఆరోపణలు చేశారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను అనుమతి లేకుండా వినియోగించుకున్నట్టు ఆరోపించారు. ఈ ఆరపణలను ప్రశాంత్ కిశోర్ టీం తోసిపుచ్చింది. ఈ పార్టీలో వైరం రచ్చకెక్కిన సందర్భంలో ప్రశాంత్ కిశోర్.. తన మాజీ బాస్, బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)తో సర్‌ప్రైజ్ డిన్నర్ చేశారు.
నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో ప్రశాంత్ కిశోర్ నేతగా గతంలో కొనసాగారు. ఆ పార్టీలో నెంబర్ 2గా కొనసాగారు. 2020లో నితీష్ కుమార్.. పీకేను పార్టీ నుంచి తొలగించారు. అప్పటి నుంచి వీరిద్దరు మళ్లీ కలువలేదు. ఇదిలా ఉండగా, బిహార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పుడు బీజేపీ మెజార్టీ బలం ఉన్న ఎన్‌డీఏలో తక్కువ మంది ఎమ్మెల్యేలతో నితీష్ కుమార్ పార్టీ ఉన్నది. ఈ కూటమే ఇప్పుడు బిహార్‌లో అధికారంలో ఉన్నది.
తాము ఇద్దరూ డిన్నర్ చేసినట్టు నితీష్ కుమార్ విలేకరులకు కన్ఫామ్ చేశారు. అయితే, ఇది కేవలం మర్యాదపూర్వకమైన సమావేశం మాత్రమేనని, అంతకు మించి అందులో ఏమీ వెతుకవద్దని తెలిపారు. పీకే కూడా ఇదే కామెంట్ చేశారు. నితీష్ కుమార్‌కు ఒమిక్రాన్ వేరియంట్ సోకినప్పుడు ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకోవడానికి తాను కాల్ చేశానని, అప్పుడే ఒకసారి తనతో కలుస్తానని సీఎం నితీష్ కుమార్ చెప్పారని వివరించారు. ఆ మాట ఇవాళ కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. తాము రాజకీయంగా విరుద్ధమైన చోట్ల ఉన్నామని కిశోర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎలాంటి ఒప్పందాలూ లేదా ఇతర రాజకీయ విషయాలేమీ చోటుచేసుకోలేదని వివరించారు.
ప్రశాంత్ కిశోర్ కూడా ఇటీవలే తనకు నితీష్ కుమార్‌తో ఇంకా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాను ఎప్పుడైనా మళ్లీ రీకనెక్ట్ అయ్యే నేతల్లో ఆయన ఒకరు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఈ భేటీతో రెండు పార్టీలకు సందేశాలు ఇచ్చారా? అనే మరో చర్చ మొదలైంది.
టీఎంసీలో తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేశారని కొందరు వాదిస్తున్నారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల మధ్య వైరం మొదలైనా.. మమతా బెనర్జీతో తమకు సన్నిహిత సంబంధాలు ఎప్పట్లాగే ఉన్నాయని ప్రశాంత్ కిశోర్ టీమ్ తెలిపింది. కాగా, బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు బీజేపీ నేతల నుంచి కొన్ని హద్దుమీరిన వ్యాఖ్యలు ఎదురవుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ.. బీజేపీతో పొత్తుపెట్టుకున్నా.. లబ్ది మాత్రం బీజేపీకే ఎక్కువ జరిగింది. జేడీయూ ఊహించని రీతిలో క్షీణించినా.. బీజేపీ మాత్రం ఘనంగా సంఖ్యను పెంచుకుంది. అయితే, ముందస్తుగానే తాము సీఎంగా నితీష్ కుమార్‌ను అనుకోవడంతో జేడీయూకు తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆయనే సీఎంగా ప్రమాణం చేశారు. నితీష్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. ప్రశాంత్ కిశోర్‌తో నితీష్ కుమార్ భేటీ.. బీజేపీకి ఒక సందేశాన్ని ఇచ్చినట్టయిందనే మరో చర్చ జరుగుతున్నది.