
భారత్‌లో కన్నడ అత్యంత వికారమైన భాష అంటూ నిన్న గాక మొన్న ప్రముఖ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కన్నడ ప్రజల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గూగుల్‌ను విడిచిపెట్టేది లేదని వారు హెచ్చరించారు. ఈ వివాదం సద్దుమణగకముందే మరో అంతర్జాతీయ దిగ్గజం కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. కర్ణాటక రాష్ట్ర జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీని విక్రయించినందుకు గానూ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వివాదంలో చిక్కుకుంది. అమెజాన్‌కు చెందిన కెనడా వెబ్‌సైట్‌లో ఈ తరహా బికినీ వెలుగుచూడడం తాజా వివాదానికి కారణం.
బికినీ వ్యవహారంపై కర్ణాటక మంత్రి అరవింద్ లింబావాలీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ విషయంలో అమెజాన్ కెనడా వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అంతర్జాతీయ కంపెనీలు చర్యలు తీసుకోవాలని అరవింద్ కోరారు.
Also Read:చెడ్డభాష అంటూ కించపరిచి.. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన గూగుల్ !
అటు జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం అమెజాన్‌పై మండిపడ్డారు. వెంటనే ఆ కంపెనీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అమెజాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించారు. తాజా వివాదంపై అమెజాన్ స్పందించలేదు. అయితే కర్ణాటక జెండా రంగులు, చిహ్నంతో కూడిన బికినీని మాత్రం తన వెబ్‌సైట్ నుంచి మాత్రం తొలగించింది.