ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకొన్నా వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు
న్యూఢిల్లీ: ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకొన్నా వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆమె ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజల ముందు వాస్తవాలను ఉంచడమే తన ముందున్న కర్తవ్యంగా ఆమె చెప్పారు.
ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం తన పని కాదని ఆమె తేల్చి చెప్పారు. తనను బెదిరించే ప్రయత్నంలో యూపీ ప్రభుత్వం తన సమయాన్ని వృధా చేస్తోందని ఆమె విమర్శించారు. తనపై ఎన్ని చర్యలు తీసుకొన్నా కూడ తాను నిజాలను మాత్రం ప్రజలకు ప్రచారం చేస్తానని చెప్పారు. తాను కొంత మంది నాయకుల మాదిరిగా బీజేపీ చెప్పుకోలేని ప్రతినిధిని కాదు, ఇందిరాగాంధీ మనమరాలిని అంటూ ఆమె ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తితోపాటు పలు అంశాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాన్పూర్‌లోని ప్రభుత్వ శిశు ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆదివారం ప్రియాంక ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు,
వీరిలో ఇద్దరు బాలికలు గర్భవతులు కాగా, ఒకరు హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్ర బాలల హక్కుల మండలి గురువారం ప్రియాంకు నోటీసులు జారీ చేసింది. ఆశ్రమ గృహంపై తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.
కరోనాతో ఆగ్రా ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే 28 మంది మరణించినట్లు ఓ వార్త క్లిప్‌ను జతచేస్తూ జూన్ 22న ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు నరైన్ సింగ్ మంగళవారం ట్వీట్ ఉపసంహరించుకోవాలని ఆమెను కోరారు. అయితే దీనిని పట్టించుకోని ప్రియాంక ఆగ్రాలో కోవిడ్ -19 మరణాల రేటు 6.8 శాతంగా ఉందని, ఇది ఢిల్లీ, ముంబై కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.