
Mohammed Zubair Moves SC: ఉత్తరప్రదేశ్‌లో తనపై నమోదైన 6 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై యూపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేశారు. మహ్మద్ జుబేర్‌పై నమోదైన కేసుల దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక పరిశోధనా బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. జుబేర్‌పై కేసులను త్వరితగతిన విచారించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్‌ను కోరినట్లు చెప్పారు.
సిట్‌కు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) డాక్టర్ ప్రీతీందర్ సింగ్ నేతృత్వం వహిస్తారని, ఇన్‌స్పెక్టర్ జనరల్ అమిత్ వర్మ సభ్యుడిగా ఉంటారని చెప్పారు. దర్యాప్తులో సహాయపడేందుకు ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌లను సిట్‌లో నామినేట్ చేయనున్నారు.
మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ.. సీతాపూర్, లఖింపూర్ ఖేరీ, ఘజియాబాద్, ముజఫర్ నగర్, హత్రాస్ జిల్లాల్లో జుబేర్‌పై కేసులు నమోదయ్యాయి. జుబేర్ కొన్ని న్యూస్ ఛానల్స్ జర్నలిస్టులపై విరుచుకుపడ్డాడు. ఇది కాకుండా, అతను హిందూ దేవతలను అవమానించాడని, అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌లను పోస్ట్ చేశాడని ఆరోపించారు.
జూన్ 1న, హిందూ షేర్ సేన జిల్లా అధ్యక్షుడు భగవాన్ ఫిర్యాదు మేరకు సీతాపూర్‌లో జుబేర్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295 (ఎ) (ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టడం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేయబడింది.
ముగ్గురు హిందుత్వ నాయకులు యతి నరసింహానంద సరస్వతి, బజరంగ్ ముని, ఆనంద్ స్వరూప్‌లను ద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఆరోపిస్తూ జుబైర్ చేసిన ట్వీట్‌పై శరణ్ ఫిర్యాదు చేశారు. ఆశిష్ కతియార్ అనే వ్యక్తి గత నవంబర్ 25న లఖింపూర్ ఖేరీలో జుబేర్‌పై కేసు పెట్టారు. తన ఫిర్యాదులో.. జుబైర్ ట్వీట్ల ద్వారా తన ఛానెల్ గురించి ప్రజలను తప్పుదారి పట్టించాడని ఆరోపించారు. ఇదే ఆరోపణలపై ఇతర జిల్లాల్లో కూడా జుబేర్‌పై కేసులు నమోదయ్యాయి. గతంలో సీతాపూర్‌లో నమోదైన కేసులో జుబేర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.