
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మొహమ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఆయన జైలులోనే ఉండబోతున్నారు. ఎందుకంటే.. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. మతపరమైన భావోద్వేగాలను గాయపరిచాడని తొలుత ఢిల్లీ పోలీసులే ఆయనను అరెస్టు చేశారు.
హిందూ మత గురువులపై అభ్యంతరకరంగా ట్వీట్ చేశాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్‌ను సీతాపూర్ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత జుబేర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జుబేర్ పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ మహేశ్వరిలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. మొహమ్మద్ జుబేర్‌కు వెకేషన్ బెంచ్ ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ను షరతులతో మంజూరు చేసింది.
ఈ కాలంలో మొహమ్మద్ జుబేర్ ట్వీట్ చేయరాదు.. బెంగళూరు సహా ఎక్కడైనా ఆధారాలు ధ్వంసం చేయరాదు. ఈ బెయిల్ కేవలం జూన్ 1వ తేదీన దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు మాత్రమే చెందుతుంది. ఇతర కేసులతో దీనికి సంబంధం లేదు. కేసు విచారణపై తాము ఎలాంటి స్టే విధించలేదని స్పష్టం చేసింది.
బెయిల్ ఆర్డర్‌ను కనీసం సోమవారం వరకైనా వాయిదా వేయాలని యూపీ పోలీసుల తరఫు వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా వాదించారు. కానీ, సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు.
ఈ రోజు వాదనల్లో జుబేర్ కౌన్సెల్ సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొంజాల్వేజ్ వాదిస్తూ.. విద్వేషపూరిత ప్రసంగం చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు అయిందని అన్నారు. కానీ, విషపూరిత భాషను బట్టబయలు చేసిన సెక్యులర్ ట్వీటర్‌ను మాత్రం జైలుకు పంపారు అని వాదించారు.
సీతాపూర్‌లో నమోదైన కేసులో ఆయన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసును కొట్టేయాలని జుబేర్ వాదించారు. ముందస్తు బెయిల్, కేసు కొట్టివేత పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని తాను సవాల్ చేస్తున్నానని గొంజాల్వేజ్ అన్నారు. హైకోర్టులో.. ఇక్కడా కూడా తన వాదన ఒకటేనని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సరైన కారణమే లేదని, ఆ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతున్నట్టు తెలిపారు.
కాగా, బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. ఆయన చేసిన ట్వీట్ ఒక్కదాన్నే ప్రత్యేకంగా చూడొద్దని, ఆయన తీరును పూర్తిగా దర్యాప్తు చేయాలని సొలిసిటర్ జనరల్ వాదించారు. ఆయన తరుచూ నిబంధనలు అతిక్రమించారని, రెండేళ్లలో ఆరు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆయనకు భారత్‌తో సఖ్యంగతా లేని దేశాల నుంచీ విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.
చివరకు సుప్రీంకోర్టు జుబేర్రకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ను షరతులతో మంజూరు చేసింది.