ఆర్బీఐ గవర్నర్ రూ. 2,000 నోట్ల ఉపసంహరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు సుమారు సగం మేరకు రూ. 2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చినట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో రూ. 2000 నోట్లను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని ఆర్బీఐ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు చాలా మంది అప్రమత్తమయ్యారని తెలుస్తున్నది. అందుకే దాదాపు సగం మేరకు ఈ కరెన్సీ నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు వెనక్కి వచ్చేసినట్టు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
2023 మార్చి 31వ తేదీ నాటికి రూ. 3.62 లక్షల విలువైన రూ. 2,000 నోట్లు చెలామణిలో ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, దీని గురించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాసు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రూ. 1.80 లక్షల విలువైన రూ. 2,000 నోట్లు వెనక్కి వచ్చేసినట్టు వివరించారు. ఇందులో 85 శాతం నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లుగా వచ్చినట్టు వివరించారు.
మే 19వ తేదీన ఆర్బీఐ రూ. 2,000 నోట్లను ఉపసంహరించే నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవి చెల్లుబాటు అవుతాయని తెలిపిన ఆర్బీఐ అంతలోపు వాటిని మార్చుకోవాలని సూచించింది. మే 23 నుంచి రూ. 2,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, లేదా మార్చుకోవచ్చని వివరించింది. ఒక్కసారికి రూ. 20,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది.
Also Read: ముంబయి దారుణ హత్య కేసు.. బాధితురాలు అనాథ, రేషన్ షాప్‌లో నిందితుడితో పరిచయం
అలాగే, రూ. 500 నోట్లను వెనక్కి తీసుకునే ఆలోచనలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. అలాగే,రూ. 1,000 నోట్లనూ మళ్లీ ప్రవేశ పెట్టే ఆలోచనలూ లేవని వివరించారు. కాబట్టి, ఈ విషయాలపై వదంతలు వ్యాప్తి చేయరాదని, వాటిని పట్టించుకోరాదని పేర్కొన్నారు.