
హిందువులని ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితం చేయొద్దని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు నివసించే ప్రజలంతా హిందువులే అని చెప్పారు. హిందువు అనేది మతం కంటే చాలా గొప్పదని, అది భౌగోళిక గుర్తింపు అని అన్నారు.
హైదరాబాద్‌లో శనివారం జరిగిన డిజిటల్ హిందూ సెమినార్ కార్యక్రమానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వనీ చౌబే హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఇండియా పాలసీ ఆర్గనైజేషన్ ఈ సదస్సును నిర్వహించింది.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మన దేశం విజ్ఞాన భూమి అని చాలా మంది విదేశీ మేధావులు అంగీకరించారని గుర్తు చేశౄరు. మనమందరం భారతీయులమని గర్వపడాలని సూచించారు.
‘‘ హిందూత్వం అనేది ఒక జీవన విధానం, మనం ‘హిందూ’ అనే పదాన్ని కొంత సరిహద్దుల మేరకే పరిమితం చేయకూడదని నేను చెబుతున్నాను. హిందువు అనేది భౌగోళిక గుర్తింపు. హిమాలయాలు, హిందూ మహాసముద్రం మధ్య నివసించే ప్రజలందరూ హిందువులే’’ అని తెలిపారు. భారతదేశంలో నివసించే ప్రతీ వ్యక్తికి హిందూ పూర్వీకులు ఉన్నారని, ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరినీ హిందువుగా మారుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయాన్నే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు వ్యక్తపరుస్తున్నాయి.
దేశ సమైక్యతకు, బలానికి ప్రతీకగా నిలిచే ఈ కార్యక్రమానికి ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు హాజరవుతున్నారని కేంద్రమంత్రి చౌబే అన్నారు. భారతదేశం సజీవ ప్రజాస్వామ్యానికి ఉదాహరణ అని, దీనిని ప్రపంచం ఆమోదించిందని అన్నారు. మన దేశాన్ని మన తల్లిగా భావిస్తామని చెప్పారు. భారతదేశాన్ని ‘భారత మాత’గా చూస్తాం. ఇదే మనల్ని మిగతా వారి నుండి వేరు చేస్తుందని తెలిపారు. గంగా నది పరిరక్షణ, పునరుజ్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగా’ అనే ప్రాజెక్టును చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి చౌబేతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్ రావు, ఎంపీ మనోజ్ తివారీ కూడా హాజరయ్యారు. దాదాపు 1,000 మంది యువ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.