
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. గతేడాది మార్చి లో దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు అందరు ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పనులు చేయడం మొదలుపెట్టారు. కాగా.. ప్రస్తుతం దేశంలో పరిస్థితి సద్దుమణిగింది. కరోనా వైరస్ ప్రభావం కూడా తగ్గింది. దీంతో మళ్లీ కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇక నుంచి ఆఫీసులకు రావాల్సిందేనంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వాళ్లకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకూ అండర్ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులు మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఇక గతేడాది మేలో డిప్యూటీ సెక్రటరీ కంటే తక్కువ స్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఆఫీసులకు రావాల్సిందిగా కేంద్రం ఆదేశించింది.
అయితే తాజా ఆదేశాల ప్రకారం ఇక నుంచి అన్ని స్థాయిల అధికారులు ఆఫీసులకు వెళ్లాల్సిందే. కాకపోతే ఆయా శాఖల విభాగాధిపతులు సూచించిన మేరకు వివిధ సమయాల్లో ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం మాత్రం ప్రస్తుతానికి అమలు చేయడం లేదు. ఇక అన్ని శాఖల క్యాంటీన్లను కూడా తెరుచుకోవచ్చని తాజా ఆదేశాల్లో కేంద్రం స్పష్టం చేసింది.