ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం.. పార్టీ పోటీ చేసే స్థానాలపై ప్రకటన

By telugu teamFirst Published Nov 22, 2021, 2:28 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు కసరత్తుల్లో వేగం పెంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ పార్టీలు ప్రచారంలోకి దిగాయి. తాజాగా, ఎంఐఎం పార్టీ కూడా ఈ ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. సుమారు 100 స్థానాల్లో పోటీ చేస్తామని, పొత్తు కోసం ఒకట్రెండు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

లక్నో: వచ్చే ఏడాది తొలినాళ్లలో Uttar Pradesh అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికలపై అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు అక్కడ ఒక్క సీటూ గెలుచుకోని ఏఐఎంఐఎం ఈ సారి బోణీ కొట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు, తాజాగా, అక్కడ పోటీ చేసే స్థానాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో AIMIM సుమారు 100 సీట్లల్లో పోటీ(Contest) చేస్తామని ప్రకటించారు. అయితే, కూటమిపై ఇప్పుడే చెప్పలేమని వివరించారు. వచ్చే రోజుల్లో అవసరమైతే ఇతర పార్టీలతో జత కట్టడానికీ సిద్ధమేనని సంకేతం ఇచ్చారు.

ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) మీడియాతో మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వంద స్థానాల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుందని వివరించారు. మరో ఒకటి రెండు పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, సమీప భవిష్యత్తులో వాటితో పొత్తు పెట్టుకుంటామా? లేదా? అనే విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే, ఈ సారి తాము కచ్చితంగా ఎన్నికల్లో గెలిచే స్థాయిలో ఉన్నామని చెపన్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎంఐఎం మరింత బలోపేతం అయిందన్న విషయం సత్యమని అన్నారు. ఈ రోజు తమ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచే స్థాయికి చేరిందని వివరించారు. ఎన్నో ఓట్లను ఎంఐఎం పార్టీ సాధిస్తుందనీ తెలిపారు.

Also Read: రాజస్తాన్‌లోనూ ఎంఐఎం పాగా.. పార్టీ యూనిట్ సన్నాహకాల్లో ఓవైసీ

2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లను గెలుచుకుంది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లను, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ 19 సీట్లను గెలుచుకున్నాయి. కాగా, అతిపురాతన పార్టీ కాంగ్రెస్ మాత్రం ఏడు సీట్లతో సరిపెట్టుకుంది. మిగతా స్థానాల్లో ఇతర అభ్యర్థులు గెలిచారు. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ పోటీ చేసింది. అప్పుడు భాగీదారి సంకల్ప్ మోర్చాతో కలిసి బరిలోకి దిగింది. కానీ ఒక్క సీటునూ గెలుచుకోలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

Also Read: జిన్నా కామెంట్‌పై ఒవైసీ రియాక్షన్.. ‘భారత ముస్లింలకు సంబంధం లేదు’

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం, యాదవ్‌ల ఓట్లు కీలకంగా ఎన్నికల విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అనగానే ఈ రెండు వర్గాలను సంతృప్తి పరిచే ప్రకటనలు, హామీలు కనిపిస్తుంటాయి. హిందూ, ముస్లిం అంశం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నది. గతేడాది అఖండ విజయం సాధించిన బీజేపీ ఈ సారి కూడా కచ్చితంగా చాలా సీట్లు గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. సాగు చట్టాల రద్దు డిమాండ్ చేస్తూ జరిగిన రైతు ఆందోళనలు ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ జిల్లాలపై ప్రభావం ఉన్నది. ఈ నేపథ్యంలోనే సాగు చట్టాల రద్దును ప్రధాని ప్రకటించారు. కాగా, ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ పశ్చిమ జిల్లాల్లో చేపట్టారు.

మీడియా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 110 నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఉన్నది. 110 స్థానాల్లో 30 నుంచి 39శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. 44 సీట్లలో 40 నుంచి 49శాతం, 11 సీట్లల్లో ముస్లిం ఓటర్లు సుమారు 50 నుంచి 56 శాతం ఉన్నారని తెలుస్తున్నది.

click me!