రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంఐఎం.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు..

By Sumanth Kanukula  |  First Published Oct 22, 2023, 10:45 AM IST

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎంఐఎం సిద్దమైంది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం ఇప్పటివరకు మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలపనున్నట్టుగా తెలిపింది.


రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎంఐఎం సిద్దమైంది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం ఇప్పటివరకు మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలపనున్నట్టుగా తెలిపింది. రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి మరిన్ని పేర్లను ప్రకటిస్తామని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం తెలిపారు. రాజస్థాన్‌లో తొలిసారిగా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎన్నికల బరిలోకి దిగుతుందని చెప్పారు. జైపూర్‌లోని హవా మహల్, సికార్‌లోని ఫతేపూర్, భరత్‌పూర్‌లోని కమాన్ నియోజకవర్గాల నుంచి ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టిందని తెలిపారు. 

అసదుద్దీన్ ఒవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించి మరిన్ని పేర్లను ప్రకటిస్తాము. పార్టీ తొలిసారిగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మా అభ్యర్థుల విజయం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఆదివారం జైపూర్‌లో ఎంఐఎం అభ్యర్థుల బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Latest Videos

రాజస్తాన్‌ అసెంబ్లీ ఎంఐఎం వ్యూహం గురించి వివరిస్తూ.. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని, అంతర్గత పోరులో ఆ పార్టీ నిమగ్నమైందని చెబుతూ ప్రజల్లోకి వెళ్తామని ఒవైసీ అన్నారు. అలాగే బీజేపీ మతతత్వ, మెజారిటీ అనుకూ ప్రవర్తనను కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 

రాజస్తాన్‌లో తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పడంపై ప్రశ్నించగా.. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు చాలా విషయాలు చెబుతున్నారని సెటైర్లు వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తామని గెహ్లాట్ చెప్పారని.. కానీ ఆయన కుమారుడు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. 

మరోవైపు ఫతేపూర్ పట్టణంలోని భించ్రీలో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ కారణంగా బీజేపీ అధికారంలో ఉందని, నరేంద్ర మోదీ రెండుసార్లు దేశానికి ప్రధాని కాగలిగారని అన్నారు. వారి పనికిరానితనం, విధానాలలో ద్వంద్వ ప్రమాణాలు, తప్పుడు వాగ్దానాల వల్ల బిజెపి విజయం సాధిస్తుందని అన్నారు. 
 

click me!