
భార్యతో గొడవపడి ఓ డాక్టర్ బిల్డింగ్ పై నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలోని హౌజ్ ఖాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ మనీష్ శర్మ కి తృప్తది చౌదరితో ఆరు నెలల క్రితం వివాహమైంది. మనీష్ శర్మ ఎయిమ్స్ లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తుండగా.. భార్య తృప్తి చౌదరి ఛండీగడ్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య ఓ విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీష్ శర్మ తను నివాసం ఉంటున్న నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. మనీష్ శర్మను చుట్టుపక్కల వారు ఎయిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.