ఆచితూచి వ్యవహరించాలి... ఎన్నో పరిశీలించాలి: రష్యా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 11, 2020, 10:01 PM IST
Highlights

స్ఫుట్నిక్‌పై స్పందించారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. ఈ వ్యాక్సిన్‌పై ఆచితూచి వ్యవహరించాలని, దీనిని వాడే ముందు సురక్షితమైనదా, ప్రపంచస్థాయి  ప్రమాణాలను కలిగి వుందా అనేది పరిశీలించాలని ఆయన సూచించారు

ప్రపంచం కోవిడ్ కోరల్లో విలవిలలాడుతున్న సమయంలో రష్యా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘‘స్ఫుట్నిక్ వీ’’  పై మానవాళి గంపెడాశలు పెట్టుకుంది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని నిపుణులు ఈ వ్యాక్సిన్ సామర్ధ్యంపై తలో రకంగా స్పందిస్తున్నారు.

తాజాగా స్ఫుట్నిక్‌పై స్పందించారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా. ఈ వ్యాక్సిన్‌పై ఆచితూచి వ్యవహరించాలని, దీనిని వాడే ముందు సురక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగి వుందా అనేది పరిశీలించాలని ఆయన సూచించారు.

పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టేముందు ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదా అనేది వెల్లడికావాల్సి వుందని గులేరియా అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ పరీక్షల శాంపిల్ పరిమాణం, దీని సామర్థ్యం వంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టవచ్చన్నారు.

Also Read:ప్రపంచంలోనే తోలి కరోనా వాక్సిన్ విడుదల చేసిన రష్యా

వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం కొనసాగుతాయనేది కూడా పరిగణనలోనికి తీసుకోవాలని రణ్‌దీప్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన చేసిన నేపథ్యంలో గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ వ్యాక్సిన్‌పై ఇంకా తుది పరీక్షలు జరుగుతుండగానే రష్యా వ్యాక్సిన్‌కు ప్రభుత్వం అనుమతించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రోబోయే రోజుల్లో కోవిడ్ రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించేందుకు రష్యా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇకపోతే భారత్‌లో తయారవుతున్న దేశీ వ్యాక్సిన్‌లపై గులేరియా స్పందించారు. భారత్ దేశంలో వ్యాక్సిన్లు రెండు, మూడవ దశలో ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధిపై భారత్ కసరత్తు చేస్తోందని, వాటిని భారీగా ఉత్పత్తి చేసే సామర్ధ్యం మనదేశానికి వుందని గులేరియా స్పష్టం చేశారు.

కాగా ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్ వేయించినట్లు ఆయన ప్రకటించారు.

దీనిని తీసుకున్న అనంతరం ఆమెలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ధీటుగా పెరిగాయని తెలిపారు. దీనిని తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఇస్తామని పుతిన్ వెల్లడించారు. 
 

click me!