
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఆకతాయి చేష్టల కారణంగా విద్యా కుసుమం నేలరాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లాకు చెందిన సుదీక్ష భాటీ (20) చిన్నతనం నుంచే చదువుల్లో మంచి ప్రతిభ చూపించింది.
ఈ క్రమంలో 2018లో సీబీఎస్‌సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించింది. తద్వారా దేశానికి, కన్నవారికి, పుట్టిన వూరికి ఎంతో పేరు తీసుకొచ్చింది.
అయితే కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో భయానక పరిస్థితులు ఏర్పడటంతో సుదీక్ష భారతదేశానికి తిరిగి వచ్చింది. మళ్లీ ఆగస్టులో అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్‌తో కలిసి బైక్‌పై సోమవారం బంధువుల ఇంటికి బయల్దేరింది.
ఈ క్రమంలో ఓ ఆకతాయి వీరి బైక్‌ను వెంబడించాడు. రోడ్డుపైనే మితిమీరిన వేగంతో స్టంట్లు చేస్తూ సుదీక్ష ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. సుదీక్ష ఆకస్మిక మరణంతో ఆమె కుటుంబం, బంధువులు చివరికి గ్రామస్తులు సైతం విషాదంలో మునిగిపోయారు.
ప్రమాదానికి కారణమైన ఆకతాయి కావాలని తమ కుమార్తెను వెంబడించి ఆమె మరణానికి కారణమయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ వల్ల ముందున్న బైకర్ సడన్‌గా బ్రేక్ వేయడంతోనే రెండు బైకులు ఢీకొట్టాయని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు.
ఈ మేరకు ప్రమాదం జరిగిన ప్రాంతంలో విచారించామని బులంద్‌షహర్ పోలీసులు తెలిపారు. కానీ సుదీక్ష కుటుంబసభ్యులు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేసినదేనని తేల్చి చెబుతున్నారు. దీంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.