
అగ్నిపథ్ ఆందోళనకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆజ్యం పోస్తోందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ‘సిట్-ఇన్ ప్రదర్శన’ చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంజలి నింబాల్కర్‌పై ఆయన మండిపడ్డారు. త్రివిధ దళ్లాలో సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని బసవరాజ్ బొమ్మై కొనియాడారు.
“ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి కాంగ్రెస్ అగ్నికి ఆజ్యం పోస్తోందనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే చేసిన సిట్ ప్రదర్శనే నిదర్శనం” అని కర్ణాటక సీఎం అన్నారు. ‘‘ మిలిటరీ శిక్షణ కోసం యువతను చేర్చే విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉంది. యువత 17-21 సంవత్సరాల మధ్య సైనిక శిక్షణ పొందినట్లయితే వారికి తరువాత అనేక అవకాశాలు లభిస్తాయి ’’ అని అన్నారు.
ఎంపీలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దు - లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
బసవరాజ్ బొమ్మై నిరసనల సందర్భంగా హింస, ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టం గురించి ప్రస్తావించారు. అగ్నిప్రమాదం కేవలం క్షమించరానిది అని అన్నారు. ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. బాధ్యతాయుతమైన ఏ వ్యక్తి ఇలా చేయరని అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని చాలా స్పష్టంగా అర్థమైందని, దీన్ని ప్రజలు త్వరలోనే చూసి అర్థం చేసుకుంటారని తెలిపారు.
‘‘ యువతను స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది ’’ అని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆదివారం ఆరోపించారు. ప్రతిపక్షం దుష్ప్రవర్తనకు అలవాటు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన సమస్యలపై అందరూ కలిసికట్టుగా నిలబడాలని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ లేదా ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులుగా కాకుండా భారతీయులుగా ఉండాలని సూచించారు.
Agnipath : ‘‘52 ఏళ్లు జాతీయ జెండా ఎగురవేయని వారు సైనికులను గౌరవిస్తారా..’’ - రాహుల్ గాంధీ
ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అయితే ఈ పథకం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల్లో ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. రోడ్లపై బైఠాయించి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లను తీసుకొచ్చి వాటికి నిప్పుపెట్టారు. అలాగే రైల్వే కోచ్ లను తగులబెట్టారు. ఈ నిరసన నేపథ్యంలో అగ్నిపథ్ పై ఒక్క సారిగా దేశంలో చర్చ మొదలైంది. ఈ పథకంపై కొనసాగుతున్న నిరసనలకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు మద్దతు ఇస్తుంటే.. ఈ ఆందోళనలు బీజేపీ పాలిత ప్రాంతాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు.