
Agnipath Protests: అగ్నిపథ్ పథకంపై (Agnipath Protests) దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. ఈ పథకం ప్రకారం కేవలం నాలుగేళ్ల మాత్రమే ఉద్యోగంలో ఉంటామనీ, ఆ తరువాత ఉద్యోగాలు పోతాయానే విషయాన్ని అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి.
అయితే.. నిత్యం నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉండే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ పథకం గురించి స్పందించారు. ట్విట్టర్ వేదికగా నిరసనలపై విచారం వ్యక్తం చేశారు. అంతే కాకుండా.. ఈ పథకం కింద నాలుగేండ్లు పని చేసి బయటకు వచ్చిన అగ్నివీరులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
ఈ పథకం కింద.. 17న్నర నుండి 21 సంవత్సరాల వయస్సు గల యువతను ఆర్మీ, ఎయిర్, నేవీలో నాలుగేళ్ల కాలానికి రిక్రూట్ చేసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత.. వీరిలో 25 శాతం మందికి రెగ్యులర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం 2022 సంవత్సరానికి గరిష్ట వయోపరిమితిని 23కి పెంచింది.
ఈ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చెలారేగడంపై ఆనంద్ మహీంద్ర తన విచారం వ్యక్తం చేస్తూ.. "అగ్నీపథ్ కార్యక్రమానికి వ్యతిరేకంగా జరిగిన హింసకు చింతిస్తున్నాను. గత సంవత్సరం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. నేను చెప్పాను. నేను ఆ విషయాన్ని పునరావృతం చేస్తున్నాను. అగ్నివీర్ల క్రమశిక్షణ, నైపుణ్యం వారిని ఉపాధి పొందేలా చేస్తుంది. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువతను మహీంద్రా గ్రూప్ రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందించి.. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఎలాంటి పోస్ట్ ఇవ్వనుంది..? అని ప్రశ్నించారు. కార్పోరేట్ రంగంలో అగ్నివీర్‌లకు భారీ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన బదులిచ్చారు. నాయకత్వం, టీమ్ లీడర్‌షిప్, దేహదారుఢ్యం కలిగిన అగ్నివీర్‌లకు చాలా విభాగాల్లో అవకాశాలు ఉంటాయని చెప్పారు.
ఇతర కంపెనీల మద్దతు
అలాగే.. టాటా సన్స్ గ్రూప్స్ తో పాటు దేశీయ కంపెనీలు అగ్నిపథ్ పథకానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ కార్యక్రమం కింద రిక్రూట్‌మెంట్ అయి.. శిక్షణ పొందిన, సమర్థులైన, యువ అగ్నివీర్‌లను తమ గ్రూప్ స్వాగతం పలుకుతున్నాయని తెలిపాయి. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకం.. యువతకు దేశ రక్షణ దళాలకు సేవ చేసేందుకు గొప్ప అవకాశం మాత్రమే కాదు, టాటా గ్రూప్‌తో సహా అనేక పరిశ్రమలు అగ్నివీరులకు ఉపాధి కల్పిస్తాయని తెలిపారు.
దేశ సేవ చేసిన అగ్నివీరులను టాటా గ్రూప్ గుర్తిస్తామనీ, అది ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఆర్‌పిజి ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, బయోకాన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి కూడా తమ అభిప్రాయాలను తెలియజేసి అగ్నిపథ్ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
కాగా.. కేంద్రం ఈ పథకాన్ని జూన్ 14న ప్రకటించగా.. తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఆందోళనలకు మద్దతిస్తూ సోమవారం పలు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే ఇంత తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగతున్నప్పటికీ.. కేంద్రం మాత్రం అగ్నిపథ్‌పై వెనకడుగు వేయడం లేదు. ఈ పథకం కింద నియామకాల కోసం త్రివిధ దళాలు ఆదివారం షెడ్యూళ్లను ప్రకటించాయి.