President Election 2022: బరిలో లేనన్న శరద్ పవార్.. గులాం నబీ ఆజాద్ వైపు చూపు.. పవార్ ప్లాన్ ఏమిటీ?

By Mahesh KFirst Published Jun 14, 2022, 1:10 PM IST
Highlights

రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని కుండబద్దలు కొట్టారు. ఈ విషయాన్ని  ఎన్సీపీ నేతల సమావేశంలో చెప్పారు. అదే పార్టీ వర్గాలు గులాం నబీ ఆజాద్ పేరును ముందుకు తేవడం చర్చనీయాంశంగా మారింది. శరద్ పవార్ మనసులోని మాటేనా? అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఏది మాట్లాడినా.. ప్రకటించినా కచ్చితంగా చర్చ జరుగుతుంది. రాజనీతిజ్ఞుడిగా పేరు సంపాదించుకున్న శరద్ పవార్ నిర్ణయాలు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అసాధ్యాలను సుసాధ్యం చేసే సామర్థ్యం ఆయన సొంతం. ఆయనకు పార్టీలకు అతీతంగా ఆదరణ ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికలో నిలబెట్టాలని చూసింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పార్టీ మద్దతు కూడా ప్రకటించారు. సోనియా గాంధీ పార్టీ మద్దతు తెలుపడాని మల్లికార్జున్ ఖర్గేను పవార్ దగ్గరకు పంపినట్టు తెలిసింది. కానీ, నిన్న ఎన్సీపీ నేతల సమావేశంలో శరద్ పవార్ చేసిన ప్రకటన ప్రతిపక్షాలకు ముఖ్యంగా షాక్ ఇచ్చినంత పని చేసింది. తాను రాష్ట్రపతి ఎన్నికల బరిలో లేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను బరిలో నిలబడటం లేదని చెప్పినట్టు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు తెలిపిన తర్వాతి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.

ఓడిపోయే ఎన్నిక అయినప్పటికీ బలమైన అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇవ్వాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వైసీపీ, బీజేడీల మద్దతుతో బీజేపీ సులువుగా తాము ప్రతిపాదించిన అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకోవచ్చు. కానీ, ఈ రెండు పార్టీలు తటస్థంగా వ్యవహరిస్తే బీజేపీకి కొంత కష్టం. కానీ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒకే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడం కూడా అంత సులువైన పనేమీ కాదు. పార్టీలకు అతీతంగా ఆదరణ పొందిన నేత అయి ఉండాలి. శరద్ పవార్ కాదనడంతో ఎన్సీపీ వర్గాలే గులాం నబీ ఆజాద్ సరైన అభ్యర్థిగా భావిస్తున్నట్టు తెలిపాయి. ఎన్సీపీ వర్గాల ఈ మాటకు ఎందుకు అంత ప్రాధాన్యత అంటే.. ఢిల్లీలో మమతా బెనర్జీ ప్రతిపక్షాలతో నిర్వహించే సమావేశానికి శరద్ పవార్ హాజరు అవుతున్నారు. అక్కడ ఆయన తన వైపు వాదన వినిపించి గులాం నబీ ఆజాద్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా ఒప్పించే అవకాశాలూ లేకపోలేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే విషయమై ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేయాలని శరద్ పవార్ భావిస్తున్నట్టు ఓ ఎన్సీపీ నేత వెల్లడించారు. అంతేకాదు, ప్రతిపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ సరైన వ్యక్తి అని ఎన్సీపీ వర్గాలు స్పష్టంగా పేర్కొన్నాయి. దీంతో శరద్ పవార్ ప్లాన్ ఇదేనా.. గులాం నబీ ఆజాద్‌ను అభ్యర్థిగా దించాలనే ఆలోచనలో ఉన్నారా? అనే చర్చ జరుగుతున్నది. గులాం నబీ ఆజాద్‌కూ అధికార బీజేపీలోనూ మంచి ఆదరణ ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, ఎన్‌డీయే కూడా గులాం నబీ ఆజాద్‌ పేరును పరిశీలిస్తున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయంగా ముస్లిం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ముస్లిం నేతను రాష్ట్రపతిగా చేయాలనే ఆలోచనలు చేసినట్టూ వార్తలు వచ్చాయి. దీనికితోడు ప్రధాని మోడీకి గులాం నబీ ఆజాద్‌తో మంచి సాన్నిహిత్యం ఉన్నది. కొన్ని నెలల ముందు నుంచే గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్రపతి చేసే అవకాశాలు ఉన్నాయని కథనాలు వెలువడ్డాయి.

అయితే, ఎన్డీయే దగ్గర మరికొన్ని అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. వీటన్నింటిని పక్కనపెడితే ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నే మళ్లీ రాష్ట్రపతిగా కొనసాగించవచ్చునని, లేదా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడినీ రాష్ట్రపతిగా బరిలోకి దింపవచ్చనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.

click me!