
Yogi Adityanath: సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ప్రధానంగా.. ఉత్తరప్రదేశ్ లో మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ.. మరోసారి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ విజయం సాధించడంతో గత రికార్డులు బద్దలయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ సరికొత్త చరిత్రను సృష్టించారు. యూపీలో బీజేపీ తిరుగులేని.. ఎదురులేని పార్టీగా నిలబెట్టాడు. యూపీలో బీజేపీ చేసిన దండయాత్రలో యోగీ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు రికార్డులు నమోదు కాబోతున్నాయి. మరి ఆ రికార్డులేంటో తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లో 1952, మే 20న తొలి అసెంబ్లీ కొలువుదీరినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 21 మంది సీఎంలుగా పనిచేశారు. అయితే.. ఈ 71 ఏండ్ల యూపీ ఎన్నికల చరిత్రలో ఐదేండ్ల పూర్తికాలం పదవిలో ఉండి, వరుసగా రెండోసారి తన పార్టీని అధికారంలోకి తెచ్చిన తొలి సీఎంగా యోగీ నయా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు చంద్రభాను గుప్తా, ఎన్డీ తివారీ వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. కానీ, ఎన్డీ తివారీ రెండోసారి పూర్తి పదవీ కాలంలో పదవీలో కొనసాగలేదు. ఇలా 71 ఏండ్ల తర్వాత వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేసిన నేతగా యోగి ఆదిత్యనాథ్ చరిత్రలో నిలువనున్నారు.
>> ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ సెంటిమెంట్ బలంగా ఉంది. ఎన్నికల ముందు నోయిడాలో పర్యటించిన ఏ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్ 34 ఏండ్లుగా ప్రచారంలో ఉంది. అయితే యోగీ ఆదిత్యనాత్ నోయిడాలో పర్యటించినప్పటికీ రెండోసారి విజయం సాధించి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడు. ఇది కూడా ఒక రికార్డే.
>> సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు బీజేపీ అభ్యర్థి రెండో సారి కావడం కూడా రికార్డే.. బీజేపీ నుంచి 1957లో సంపూర్ణానంద్, 1962లో చంద్రభాను గుప్తా, 1974లో హెచ్ఎన్ బహుగుణ, తర్వాత ఎన్డీ తివారీ వరుసగా రెండోసారి పార్టీని గెలిపించారు. వారు ఐదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. యోగి ఐదేళ్ళపాటు పూర్తిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించిన తర్వాత మళ్ళీ ఆ పదవిని చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
>> దాదాపు 15 ఏండ్ల తర్వాత .. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సీఎం కాబోతున్నాడు. 2007లో మాయావతి, 2012లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ప్రమాణం చేసినా.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017లో యోగీ ఆదిత్యనాథ్ కూడా లోక్‌సభ సభ్యుడిగా ఉండి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు.
>> యూపీకి గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు గా పదవీ బాధ్యతలు స్వీకరించినా.. వారు ఐదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. యూపీ అసెంబ్లీకి 71ఏండ్ల చరిత్ర ఉంది. ఇప్పటివరకూ 21 మంది సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించినా.. యోగీ ఆదిత్యనాథ్ కంటే ముందు ఇద్దరు మాత్రమే పూర్తికాలం పదవిలో ఉన్నారు. మొదటి వ్యక్తి బీఎస్పీ అధినేత్రి మాయావతి (2007-2012 వరకు) కాగా, రెండో వ్యక్తి సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (2012-2017 వరకు). తాజాగా యోగీ ఆదిత్యనాథ్ మూడో వ్యక్తిగా వారి సరసన చేరాడు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ పూర్తిగా ఐదేండ్లు పదవిలో ఉన్న యూపీ మూడో ముఖ్యమంత్రిగా కూడా రికార్డు సృష్టించాడు.
>> యూపీ లో 37 ఏండ్ల తర్వాత వరుసగా రెండోసారి సీఎం అయ్యే ఘతన సీఎం యోగికే ఉంది. చివరిసారిగా 1985లో ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌డీ తివారీ వరుసగా రెండోసారి సీఎం పదవి చేపట్టాడు. ఆ తర్వాత ఈ 37 ఏండ్లలో ఎవరూ వరుసగా రెండోసారి సీఎం కాలేదు. ఇన్నాళ్ల తరువాత నేడు యోగీ ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
>> అలాగే.. వరుసగా రెండోసారి సీఎంగా కానున్న.. తొలి బీజేపీ అభ్యర్థిగా యోగీ ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో.. యోగీ కంటే ముందు కళ్యాణ్‌సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ లు బీజేపీ తరఫున పోటీ చేసినా వారు రెండో సారి అధికారం చేజిక్కించుకోలేకపోయారు.