
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో (five state election result) బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక్క పంజాబ్ (punjab) మినహా ఉత్తరాఖండ్ (uttarakhand), గోవా (goa), ఉత్తరప్రదేశ్ (uttar pradesh), మణిపూర్‌లలో (manipur) కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ ఛరిష్మా, అభివృద్ధి మంత్రం, ప్రతిపక్షాల అనైక్యత , బీజేపీ అధిష్టానం వ్యూహాల కారణంగా బీజేపీ ఫలితాల్లో దూసుకెళ్లింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాలో బీజేపీ (bjp) మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ పార్టీ గతం కంటే ఎక్కువ సీట్లు సొంతం చేసుకుని అధికారం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో గోవా సీఎంగా ఎవరు ఎన్నికవుతారు అనే చర్చ జరుగుతోంది. అయితే, ప్రస్తుతం సీఎంగా కొనసాగుతోన్న ప్రమోద్ సావంతే మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని బీజేపీ వర్గాల టాక్. ఇప్పటికే సావంత్ (pramod sawant) .. సాంకెలిమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా వుండగా.. గోవాలో బీజేపీ సీట్ల సంఖ్య గతం కంటే మెరుగుపడడంలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy).. పాత్ర ఎంతో కీలకం.
గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సహ ఇంచార్జి బాధ్యతలు తీసుకున్న ఆయన, లోతుగా విశ్లేషణ చేశారు. గ్రామ స్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుని, అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి.. పోస్టర్ల డిజైనింగ్, ప్రచారం తదితర అంశాల్ని దగ్గరుండి పర్యవేక్షించారు. దీనికితోడు పర్యాటక మంత్రిగా అక్కడ అనేక కార్యమాలు చేపట్టడం పార్టీకి బాగా కలిసి వచ్చింది. దీంతో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వారిని చైతన్యం చేయడంలో కిషన్ రెడ్డి కీలకంగా పర్యవేక్షించారు.
అలాగే.. ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేయడంలోనూ ముందున్నారు. గోవాలో క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండడంతో.. ఆ ఓట్లను ఆకర్షించేలా కిషన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. అసంతృప్తులను బుజ్జగించడం, ఓట్లు చీలకుండా అవసరమైన వారికి టికెట్లు ఇప్పించడం వంటి పనుల్లో అంతా తానై వ్యవహరించారు. మనోహర్ పారికర్ చనిపోయిన తర్వాత.. సీఎం ప్రమోద్ సావంత్‌పై కొందరు బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి.. పరిస్థితులను చక్కదిద్ది బీజేపీ మరోసారి అధికారాన్ని అందుకోవడంలో విజయవంతమయ్యారు.