
Supreme Court On Adani Row: అదానీ గ్రూప్ అంశం-హిండెన్‌బర్గ్ నివేదికపై విచారణ జరపాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారణ జరిపింది. ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్ఠమైన విధానాలను అమలు చేయడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తాము ఎలాంటి రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్స్ అనుమానాలు వ్యక్తం చేయడం లేదా విధానపరమైన విషయాల్లోకి వెళ్లడం లేదని, అయితే భారతీయ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
వివరాల్లోకెళ్తే.. అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశంలో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ అంశం దేశ ఆర్థిక వ్యవస్థ, అన్ని వర్గాలకు చెందిన పెట్టుబడిదారులతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొంటూ.. దీనిపై విచారణ జరిపించాలంటూ పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ-హిండెన్ బర్గ్ వివాదం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులను రక్షించడం గురించి సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ యంత్రాంగాన్ని మెరుగుపరిచే మార్గాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందనలను కోరింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం పెట్టుబడిదారుల రక్షణకు పటిష్టమైన విధానాలను అమలు చేయడానికి డొమైన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పడిపోవడం వల్ల భారతీయ ఇన్వెస్టర్లు కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టాలను చవిచూశారని సుప్రీంకోర్టు తెలిపింది. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపించడంతో అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. అదానీ గ్రూప్ ఎలాంటి తప్పు చేయలేదని, హిండెన్ బర్గ్ పై దావా వేస్తానని హెచ్చరించింది. అయినప్పటికీ అదానీ గ్రూప్ షేర్ల పతనం ఆగలేదు.
'భారత ఇన్వెస్టర్ల మొత్తం నష్టం కొన్ని లక్షల కోట్లు.. వారికి రక్షణ ఎలా కల్పించాలి... 10 లక్షల కోట్లు అంటున్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఎలా చూసుకోవాలి. భవిష్యత్తులో సెబీకి ఎలాంటి పాత్ర పోషించాలి' అని సీజేఐ ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఎలా ఏర్పాటు చేయవచ్చో వివరిస్తూ వచ్చే సోమవారంలోగా సమాధానం ఇవ్వాలని సెబీని ఆదేశించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం సైతం తమ ప్రతిస్పందనలు తెలియజేయాలని సూచించింది. 'ప్రతిస్పందనలో ఇప్పటికే ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, సంబంధిత కారణ కారకాలు, పెట్టుబడిదారులను రక్షించడానికి బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండవచ్చు. ఒకవేళ యూనియన్ ఈ సూచనను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే, కమిటీ అవసరమైన సిఫారసు చేయవచ్చు. వచ్చే సోమవారంలోగా సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) చట్టపరమైన, వాస్తవిక వివరాల సంక్షిప్త నోట్ దాఖలు చేయవచ్చు' అని సుప్రీంకోర్టు ఆదేశించింది.