
అన్నాడీఎంకే మాజీ మంత్రి మణికంఠన్ కు సినీ నటి చాందినీ షాక్ ఇచ్చారు. మణి కంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10కోట్లు ఇవ్వాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించడం గమనార్హం. బీసెంట్ నగర్ లో ఉంటున్న చాందినీ... మలేషియాకు చెందినవారు కావడం గమనార్హం.
కాగా.. మణికంఠన్.. తనను పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేశారని.. కానీ.. తర్వాత పెళ్లి మాట ఎత్తకుండా తనను మోసం చేశారని ఆమె ఆరోపించింది. ఈమేరకు ఆమె పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు.
ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో మాజీమంత్రి మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది.