
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) లో చేరారు. ఆమెకు పార్టీ జెండా అందజేసి కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ అధినేత రామ్‌దాస్ అథవాలే స్వాగతం పలికారు. అనంతరం ఆమెను ఆర్‌పీఐ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
బాలీవుడ్ చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను చిత్ర నిర్మాత ఖండించారు. ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఘోష్ సెప్టెంబర్ 29 న మహారాష్ట్ర గవర్నర్ బి.ఎస్. కోష్యారిని కలిశారు. ఈ సమయంలో రామ్‌దాస్ అథవాలే ఆమె వెంట ఉన్నారు.
అనంతరం వీరిద్దరు కలిసి ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్ వీఎన్ పాటిల్‌తో భేటీ అయ్యారు. 376, 354, 341, 342 సెక్షన్లతోపాటు వివిధ విభాగాల కింద చిత్ర నిర్మాతపై పాయల్ ఘోష్ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్పీఐ (ఏ) పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ అని, ఇది సమాజంలోని అన్ని వర్గాలకు సహాయపడుతుందని, మీరు పార్టీలో చేరితే ఆర్పీఐకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పానని రామ్ దాస్ అన్నారు. అందుకే ఆమె పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిపారు.