coronavirus: మళ్లీ కోవిడ్ పంజా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు

Published : May 31, 2025, 07:22 PM IST
Covid-19 India

సారాంశం

COVID: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో 20 కరోనా మరణాలు నమోదుకాగా, కర్ణాటకలో పిల్లలకు స్కూల్‌కు రాకూడదని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

Coronavirus: భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3207కి చేరుకుంది. ఇందులో కేవలం కేరళలోనే 1147 కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో 681 యాక్టివ్ కేసులతో రెండవ స్థానంలో ఉంది. కేవలం కేరళ, మహారాష్ట్ర లలో మొత్తం యాక్టివ్ కేసులలో 60 శాతం ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనాతో 20 మరణాలు

ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యధికంగా 6 మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కర్ణాటకలో మైసూరు ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల వృద్ధుడు మే 30న మరణించాడు. ఇది రాష్ట్రంలో నమోదైన మూడవ కరోనా మరణం.

అలాగే మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మరో 13 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్క మరణం నమోదైనట్టు మే 31న అధికారికంగా ధృవీకరించారు.

కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం కొత్త సర్క్యులర్ విడుదల చేసింది. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే వారికి పాఠశాలలకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించింది.

ఈశాన్య భారతంలో మళ్లీ కోవిడ్ కేసులు

మిజోరంలో 7 నెలల విరామం తర్వాత మళ్లీ 2 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. చివరి సారి అక్టోబర్ 2024లో అక్కడ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఐజ్వాల్ సమీపంలోని ఫల్కోన్‌లోని జోరమ్ మెడికల్ కాలేజ్ (ZMCH)లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) ప్రకారం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ భయం

మహారాష్ట్రలో జనవరి 2025 నుంచి ఇప్పటివరకు మొత్తం 9592 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. శుక్రవారం ఒక్క రోజే 84 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో ఇప్పటివరకు 681 కేసులు గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో గురువారం ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగా, వారు కేరళకు చెందినవారు. శ్రీనగర్ గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో చదువుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సఫారి పార్క్‌ను మే 14న కరోనా వ్యాప్తి కారణంగా మూసివేశారు.

దేశంలో వెగులుచూస్తున్న కరోనా కొత్త వేరియంట్లు

ఇక దేశవ్యాప్తంగా నాలుగు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించారు. ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహల్ ప్రకారం ఇవి LF.7, XFG, JN.1, NB.1.8.1 వేరియంట్‌లు. వీటిని ప్రధానంగా దక్షిణ, పడమర భారత రాష్ట్రాల్లో గుర్తించారు. ఈ వేరియంట్లు తీవ్రమైనవిగా లేవని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది, కానీ అవి మానిటరింగ్‌లో ఉన్న వేరియంట్లు కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారత్ లో జేఎన్.1 కేసుల పెరుగుదల

JN.1 వేరియంట్ ప్రస్తుతం భారత్‌లో అత్యధికంగా ఉంది. సగానికి పైగా నమూనాల్లో దీనిని గుర్తించారు. ఇది BA.2.86 అనే ఓమిక్రాన్ ఉపవేరియంట్‌కు చెందినదని డిసెంబర్ 2023లో WHO ప్రకటించింది. ఇందులో 30కి పైగా మ్యూటేషన్లు ఉన్నాయి, ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి.

JN.1 లక్షణాలు కొన్ని రోజులు నుంచి వారాల పాటు ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రజలు మాస్కుల వాడకం, సామాజిక దూరం పాటించడం, చేతులు తరచూ కడుక్కోవడం వంటి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu