టెక్కీ మోసం: జడ్జి, ఐఎఎస్‌ల పేరుతో కోట్లు కొల్లగొట్టాడిలా...

By narsimha lodeFirst Published 26, Sep 2018, 2:11 PM IST
Highlights

సీనియర్ సివిల్ జడ్జి అవతారమెత్తి 40 మందికి రూ. 2 కోట్లు కుచ్చుటోపి పెట్టిన టెక్కీని గుర్గావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ వారాసిగూడలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన కేదార్‌నాథ్ సాగర్ శర్మగా పోలీసులు గుర్తించారు

న్యూఢిల్లీ: సీనియర్ సివిల్ జడ్జి అవతారమెత్తి 40 మందికి రూ. 2 కోట్లు కుచ్చుటోపి పెట్టిన టెక్కీని గుర్గావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ వారాసిగూడలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన కేదార్‌నాథ్ సాగర్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఐఎఎస్ అధికారిగా, జడ్జిగా చెప్పుకొని మోసాలకు పాల్పడినట్టు  పోలీసులు చెప్పారు.

 ఐదేళ్ల క్రితం బీటెక్‌ పూర్తి చేసిన కేదార్‌నాథ్‌ నగరంలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సూపర్‌వైజర్‌గా చేరాడు. నెలకు రూ.13 లక్షల జీతం వచ్చే ఈ ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని 2012లో వదిలేశాడు.. 2016లో సిటీలో కేదార్‌నాథ్‌ ఆన్‌లైన్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. 

దీని కోసం ఏడాది క్రితం గుర్గావ్‌ వెళ్లి అక్కడి సెక్టార్‌ 102లో ఉన్న హెరిటేజ్‌ మ్యాక్స్‌ సొసైటీలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీ నుండి  వారాసిగూడకు వచ్చివెళ్లేవాడు.

దాదాపు ఆరు నెలల క్రితం అక్కడే ఓ సెకండ్‌ హ్యాండ్‌ బీఎండబ్ల్యూ కారు ఖరీదు చేసిన శర్మ హఠాత్తుగా బోగస్‌ జడ్జీ అవతారమెత్తాడు. తన వాహనంపై సీనియర్‌ సివిల్‌ జడ్జీ అని రాయించుకోవడంతో పాటు ఆ హోదాతో కొన్ని స్టాంపులు, గుర్తింపు కార్డు తయారు చేయించుకున్నాడు. 

ఉద్యోగాలు, కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు, ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తూ అందినకాడికి దండుకోవడం మొదలుపెట్టాడు. తాను తెలంగాణలో సీనియర్‌ సివిల్‌ జడ్జీనని, ప్రస్తుతం సెలవులో ఉన్నానని,  డిప్యూటేషన్‌పై గుర్గావ్‌ కోర్టుకు వస్తానంటూ నమ్మబలికాడు. 

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా మరో గుర్తింపు కార్డు తయారు చేసుకున్న శర్మ  ఐఎఎస్ అధికారిగా కూడ చలామణి అయ్యాడు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశాడు.

ఎయిమ్స్‌లో నాలుగో తరగతి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరి కొంతమంది నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు ఇప్పిస్తానంటూ ఒక్కో సీటుకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు దండుకున్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, గుర్గావ్‌కు చెందిన 40 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. ఢిల్లీకి చెందిన విడాకులు తీసుకున్న ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

అయితే నిందితుడిపై  ఓ కారు స్పేర్‌పార్ట్స్‌ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. . జూన్‌ 9న తన కారు మరమ్మతుల కోసం కేదార్‌నాథ్‌ గుర్గావ్‌ సెక్టార్‌ 51లో మర మ్మతు, స్పేర్‌పార్ట్స్‌ దుకాణం నిర్వహించే గగన్‌ భాత్రా వద్దకు వెళ్లాడు. ఆ వాహనంపై ఉన్న ‘జడ్జీ’ స్టిక్కర్‌ను చూసిన భాత్రా నిజమని నమ్మాడు. మాటల్లో ప్రభుత్వం రూ.4 లక్షలకు విక్రయించే ఇంటిని రూ.2 లక్షలకు ఇప్పిస్తానంటూ చెప్పాడు.

 ఈ మాటలు నమ్మిన గగన్‌ రూ. 2 లక్షలు ఇచ్చాడు.  అనంతరం కేదార్‌నాథ్‌ కనిపించకుండా పోయాడు. దీంతో అతని కారు నంబర్‌ (డీఎల్‌12సీ4707) ఆధారంగా గగన్‌ గుర్గావ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో మోసాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.  ఇతడి చేతిలో మోసపోయిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని గుర్గావ్‌ ఏసీపీ షంషేర్‌ సింగ్‌ ప్రకటించారు.

 

 

Last Updated 26, Sep 2018, 2:11 PM IST