Russia Ukraine War: వార్‌జోన్‌లలో ఇంకా 1000 మంది భారతీయులు.. బస్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు: కేంద్రం

Published : Mar 04, 2022, 08:52 PM ISTUpdated : Mar 04, 2022, 08:58 PM IST
Russia Ukraine War: వార్‌జోన్‌లలో ఇంకా 1000 మంది భారతీయులు.. బస్సుల ఏర్పాటుకు ప్రయత్నాలు: కేంద్రం

సారాంశం

ఉక్రెయిన్‌లో ఇంకా కనీసం మూడు వేల మంది భారతీయులు చిక్కుకుని ఉంటారని కేంద్ర విదేశాంగ శాఖ ఈ రోజు ఓ ప్రకటనలో పేర్కొంది. అందులో ప్రస్తుతం భీకర దాడులు జరుగుతున్న సుమి, ఖార్కివ్ నగరాల్లో దాదాపు వేయి మంది భారతీయులు చిక్కుకుని ఉన్నారని తెలిపింది. వారిని అక్కడి నుంచి బయటకు తేవడానికి బస్సులు నడిపించే ఏర్పాటు చేస్తున్నామని వివరించింది.  

న్యూఢిల్లీ: రష్యా(Russia) దాడితో ఛిన్నాభిన్నం అవుతున్న ఉక్రెయిన్‌(Ukraine)లో ఇంకా 2000 నుంచి 3000ల మంది భారతీయులు(Indians) చిక్కుకుని ఉన్నారు. ఇందులో కనీసం వేయి మంది వార్ జోన్‌(War Zones)లలో అంటే ప్రస్తుతం రష్యా దాడులు భీకరంగా జరుగుతున్న ఖార్కివ్, సుమి నగరాల్లో ఉన్నారని కేంద్రం తెలిపింది. సుమిలో 700 మంది వరకు, ఖార్కివ్‌లో 300 మంది వరకు భారతీయులు ఉన్నారని వివరించింది. వారిని ఆ యుద్ధ ప్రాంతం నుంచి బయటకు తేవడానికి బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. కానీ, అది కత్తిమీద సాములాగా ఉన్నదని పేర్కొంది.

ఉక్రెయిన్‌ నుంచి ప్రతి భారతీయుడు సురక్షితంగా బయటకు వచ్చే వరకు ఆపరేషన్ గంగా సాగుతుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ఉక్రెయిన్‌లో ఇంకా సుమారు రెండు నుంచి మూడు వేల మంది భారతీయులు ఉండవచ్చని, ఈ సంఖ్య కూడా మారవచ్చని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లోని ఘర్షణాత్మక ప్రాంతం నుంచి భారతీయులను తరలించడమే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. తాము రష్యా, ఉక్రెయిన్‌ ఇరు దేశాల నాయకత్వాన్ని ఇందుకోసం విజ్ఞప్తి చేశామని తెలిపారు. భారతీయులను తరలించడానికి అవసరం అయిన ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరామని వివరించారు.

ఈ రోజే సుమి స్టేట్ యూనివర్సిటీలోని ఇండియన్ మెడికల్ స్టూడెంట్లు తమను కాపాడాలని ప్రధాని మోడీకి వేదనతో విజ్ఞప్తులు చేసిన వీడియోలో కలత చెందేలా ఉన్నాయి. తమ హాస్టల్‌లో 800 నుంచి 900 మంది చిక్కుకున్నామని, తినడానికి ఆహారం నిండుకోవచ్చిందని, తాగే నీరు లేకుండా ఉంటున్నామని తెలిపారు. సరిహద్దుల్లో బస్సులు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారని, కానీ, అది తమకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని, అక్కడి వరకు తాము నడుచుకుంటూ వెళ్లలేమని వారు వేడుకున్నారు. ఎందుకంటే.. నాలుగు వైపులా స్నైపర్‌లు మోహరించి ఉన్నాయని, ఎప్పుడు కాల్పులు జరిగేవి.. బాంబులు పడేవి తెలియకున్నదని అన్నారు. తమను రక్షించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. వచ్చే 24 గంటల్లో 16 విమానాలు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి షెడ్యూల్‌లో ఉన్నాయని అరిందమ్ బాగ్చి తెలిపారు. అయితే, ఇప్పటికైతే.. చాలా మందిని సురక్షితంగా తరలించగలిగామని,తాము అడ్వైజరీ విడుదల చేసినప్పటి నుంచి సుమారు 20 వేల మంది భారతీయులను తరలించగలిగామని పేర్కొన్నారు. 

భార‌తీయ పౌరుల ర‌క్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకున్న ప్ర‌భుత్వం.. అక్కడ చిక్కుకుపోయిన భార‌త పౌరుల‌ను స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్‌ గంగలో భాగంగా మరో రెండు విమానాలు దేశ‌రాజ‌ధాని న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్‌, రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 aircrafts) ఢిల్లీ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ స్వాగతం పలికారు.

ఇదిలా ఉండగా, విద్యార్థుల త‌ర‌లింపును కూడా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌మ‌కు అనుకూలంగా ఓ ప్ర‌చారాస్త్రంగా వాడుకుంటోంద‌ని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . తాజాగా ఇదే అంశంపై టీఆర్ఎస్ (trs) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (ktr) సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థుల త‌ర‌లింపులో బీజేపీ స‌ర్కారు పీఆర్ ఎక్సర్‌సైజ్ మాదిరిగా వ్య‌వ‌హరించింద‌ని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు మోడీ దయ వల్లే ప్రాణాలు రక్షించబడ్డాయని ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను కేటీఆర్ షేర్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!