
న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాలనాపరమైన అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉండదని సుప్రీంకోర్టు ఇటీవలే ఓ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పక్కనపెడుతూ కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలనూ తమ అదుపులోకి తీసుకుంటారా? అని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాన్ని ఇచ్చింది. బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులపై నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుందని వివరించింది.
ఈ ఆర్డినెన్స్ కోర్టును ధిక్కరించడమే కాదు.. ఎన్నికలనూ ధిక్కరించడమే అవు తుందని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని, ఎన్నికైన ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించే అధికారాలను, మంత్రులకు సివిల్ సేవలు జవాబుదారీగా ఉండే నిబంధనలు అన్నింటినీ ఈ ఆర్డినెన్స్‌తో ధిక్కరించారని తెలిపారు.