జైలు కెళ్లినా సీఎంగానే.. అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు కానున్నారా? ఆప్ నేత‌లు ఏమ‌న్నారంటే..?

By Mahesh Rajamoni  |  First Published Nov 6, 2023, 10:36 PM IST

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి బీజేపీ, ప్రధాని న‌రేంద్ర మోడీ భయపడుతున్నారని ఆ పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా కేజ్రీవాల్‌ను అధికారం నుంచి దించలేమనీ, కుట్ర పన్నడం ద్వారానే అది సాధ్యమవుతుందని బీజేపీకి తెలుసున‌నీ, అందుకే ఆయ‌న‌కు ఈడీ నోటీసులంటూ ఆరోపించారు.
 


Delhi: ఢిల్లీ రాజ‌కీయాలు  హీటెక్కుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ (ఆప్) నాయ‌కుడు అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు కాబోతున్నారా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అరెస్టు చేయవచ్చనే పుకార్ల మధ్య, ప్రస్తుత పరిస్థితులపై చ‌ర్చించ‌డానికి ఆ పార్టీ అధినేత పలువురు కీలక పార్టీ సభ్యులతో సోమవారం సమావేశ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆప్ నాయ‌కులు మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే, జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని కొనసాగించాల‌నీ, ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయవద్దని ఆప్ ఎమ్మెల్యేలు కోరారు.

గతవారం ఢిల్లీ ఎక్సైజ్ కేసులో తమ ముందు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ కు విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి మీడియాతో మాట్లాడుతూ, తనను అరెస్టు చేసినా ముఖ్యమంత్రిగా కొనసాగాలని, జైలు నుంచే రాజధానిని పరిపాలించాలని ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ ను కోరారని చెప్పారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై రాజీనామా చేసే అవకాశం లేదని ఢిల్లీ మంత్రి అతిషి సోమవారం తేల్చి చెప్పారు. కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్నారనీ, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో అరెస్టు చేసినా ఆయన ఢిల్లీ సీఎంగానే ఉంటారని అతిషి అన్నారు.

Latest Videos

undefined

అలాగే, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. "సోమ‌వారం సీఎం కేజ్రీవాల్‌ ఆప్‌ నేతలతో సమావేశమయ్యారు.. బీజేపీకి ఏ పార్టీతోనైనా సమస్య ఉంటే అది ప్రధానంగా ఆప్‌తోనే అని ఎమ్మెల్యేలందరూ అన్నారు. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి బీజేపీ భయపడుతోంది. ఢిల్లీలో ఆయన్ను అధికారం నుంచి తప్పించాలని వారు కోరుకుంటున్నారని" అన్నారు. ఎన్నికల ద్వారా కేజ్రీవాల్‌ను అధికారం నుంచి దించలేరనీ, కుట్ర పన్నడం ద్వారానే అది సాధ్యమవుతుందని బీజేపీకి తెలుసున‌నీ, అందుకే ఇప్పుడు ఇలా చేస్తున్నార‌ని భరద్వాజ్ అన్నారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నవంబర్ 2న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ విచారణకు పిలిచింది. అయితే దర్యాప్తు సంస్థ ముందు ఆయ‌న హాజరుకాలేదు. అంతకుముందు, సమన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి లేఖ రాశారు. దీనిని రాజకీయ ప్రేరేపిత చ‌ర్య‌లు పేర్కొన్నారు.

click me!