Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి గాలి కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిన వేళ ఢిల్లీ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. గాలి కాలుష్య పరిస్థితిపై సమీక్షించింది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకూ తీవ్ర రూపు దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే గాలి కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని తెర మీదికి తెచ్చింది. నగరంలో పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా దీపావళి తర్వాత ఢిల్లీలోని వాహనదారులు మరోసారి సరి-బేసి నియమాన్ని అనుసరించాలని భావిస్తోంది.
సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సరి-బేసి ట్రాఫిక్ నిర్వహణ విధానాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు సరి, బేసి విధానం ప్రకారం వాహనాలపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం వల్ల కాలుష్యం తగ్గుముఖం పట్టిందా? లేదా ? అనే అంశంపై ఈ ఒక్క వారంలో అధ్యయనం చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. కాలుష్య స్థాయిలో ఏదైనా తగ్గింపు కనిపిస్తే.. తదుపరి అమలు కూడా పరిగణించబడుతుంది.
సరి-బేసి పథకాన్ని ఎన్నిసార్లు అమలు చేసింది?
undefined
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సరి-బేసి పథకాన్ని అమలు చేయడం ఇది నాలుగోసారి. అంతకుముందు 2016 లో మొదటి సారి జనవరి 1 నుండి జనవరి 15, 2016 వరకు అమలు చేయబడింది. ఆ తర్వాత 2016లోనే 15 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ మధ్య బేసి-సరి నిర్వహించబడింది. 2019లో మూడవసారి సరి-బేసి విధానం మళ్లీ నవంబర్ 4 నుండి నవంబర్ 15 వరకు అమలు చేయబడింది. ఇప్పుడూ అమలు చేస్తే నాలుగో సారి.
సరి-బేసి విధానం అంటే ఏమిటి?
ఈ విధానం ప్రకారం.. బేసి సంఖ్య రోజున బేసి సంఖ్యతో నమోదైన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతాయి, అలాగే.. సరి సంఖ్య రోజున సరి రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతాయి. తాజాగా నిబంధన ప్రకారం.. నవంబర్ 13, 15, 17 తేదీల్లో బేసి నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు రోడ్డుపైకి రావడానికి అనుమతించగా.. నవంబర్ 14, 16, 18, 20 తేదీల్లో సరి నంబర్ ప్లేట్ వాహనాలను మాత్రమే రోడ్డుపై నడపడానికి అనుమతి ఇస్తారు. ఆదివారం నాడు ఈ విధానం నుంచి మినహాయింపు ఉంటుంది.
అయితే.. ఈ విధానం అమలులో ఉన్న CNG, ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తి మినహాయింపు లభిస్తుంది. అంతే కాకుండా ఢిల్లీలో రాంగ్ నంబర్ వాహనాన్ని తప్పుడు రోజు నడిపితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బేసి-సరి పథకం సమయంలో ప్రజా రవాణాను పెంచడానికి బస్సుల సంఖ్యను పెంచడంపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మెట్రో ఫ్రీక్వెన్సీని కూడా పెంచబడుతుంది. ఈ స్కీమ్ నుంచి బైక్ రైడర్లను మినహాయిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సరి బేసి విధానంలో రోడ్లపై ట్రాఫిక్ తగ్గుముఖం పట్టడంతోపాటు ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు ఎంతో ఉపశమనం లభిస్తుందనీ, కానీ కాలుష్యం విషయంలో మాత్రం పాక్షికంగానే ఉపశమనం లభిస్తుందన్నారు. అయితే దీనికి సంబంధించిన అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. పథకం ద్వారా ఎంతమేరకు ఉపశమనం లభిస్తుందో? ఇంకా కొనసాగించవచ్చో ఈ ఒక్క వారంలో తేలిపోతుందని ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది.