
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన సొంత పార్టీ నాయకుడే బట్టబయలు చేశారు. అది కూడా ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా.. ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యే భూపిందర్ సింగ్ జూన్ ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా ఢిల్లీ జల్ బోర్డు పనులు పూర్తిగా నిలిచిపోయాయని.. ప్రజలు మురికి నీరు, దుర్వాసనతో కూడిన నీరు తాగాల్సి వస్తోందని అన్నారు. స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఢిల్లీ జల్ బోర్డు వద్ద డబ్బులు లేవని చెప్పారు.
‘‘ఢిల్లీ ప్రజలు మురికి నీరు, దుర్వాసనతో కూడిన నీరు తాగాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించి జల్ బోర్డు అధికారులతో మాట్లాడితే.. ఫండ్స్ లేవనే ఒకే ఒక్క సమాధానం వినిపిస్తుంది. దీంతో జనాలు రోగాల బారిన పడుతున్నారు’’ అని భూపిందర్ సింగ్ జూన్ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేస్తున్న పలువురు.. ఆప్ ఎమ్మెల్యే మాటలతో ఢిల్లీ మోడల్ అంటూ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనేది తేలిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే, మురికివాడలు, ఇతర జనసాంద్రత ఉన్న ప్రాంతాల ప్రజలకు రివర్స్ ఆస్మాసిస్ (RO) ప్రక్రియను ఉపయోగించి శుద్ధి చేసిన తాగునీటిని అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం 500 వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత నెలలో తెలిపారు. మాయాపురి ప్రాంతంలోని ఆర్‌ఓ ప్లాంట్‌ను పరిశీలించిన సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నాలుగు నీవాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశామని.. మొదటి దశలో 500 ప్లాన్ చేశామని చెప్పారు.