
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల్లో ఒకరిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆప్ ఆరోపించింది. తమ అభ్యర్థి నిన్నటి నుంచి కనిపించకుండా పోయారని చెప్పింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి బీజేపీ భయాందోళనకు గురవుతుందని విమర్శించారు. అందుకే తమ పార్టీ అభ్యర్థి కంచన్ జరీవాలాను బీజేపీ కిడ్నాప్ చేసిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఆరోరపించారు.
‘‘కాంచన్, అతని కుటుంబం నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. నామినేషన్ పత్రాల పరిశీలన కోసం అతడు వెళ్లాడు. నామినేషన్ పరిశీలన ముగించుకుని కార్యాలయం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం బీజేపీ గూండాలు అతడిని తీసుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు’’అని మనీష్ సిసోడియా అన్నారు. ఇది ప్రమాదకరమైనదని.. ఇది కేవలం అభ్యర్థినే కాదు ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేనని సిసోడియా అన్నారు.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదేరకమైన ఆరోపణ చేశారు. ‘‘సూరత్ (తూర్పు) నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థి కంచన్ జరీవాలా, అతని కుటుంబం నిన్నటి నుండి కనిపించకుండా పోయారు. మొదట అతని నామినేషన్ తిరస్కరించడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ అతని నామినేషన్ ఆమోదించబడింది. తర్వాత నామినేషన్ ఉపసంహరించుకోవాలని అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అతన్ని కిడ్నాప్ చేశారా?’’ అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
మరో ఆప్ నేత రాఘవ్ చద్దా స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని అన్నారు. ‘‘తొలుత ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించేందుకు విఫలయత్నం చేసిన బీజేపీ.. ఆ తర్వాత అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసింది. ఇప్పుడు కిడ్నాప్ చేసింది. గత మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించకుండా పోయాడు’’ అని రాఘవ్ చద్దా అన్నారు. అయితే ఆప్ చేస్తున్న ఈ ఆరోపణలపై బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు.
గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి అక్కడ అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈసారి గుజరాత్‌లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశలుగా జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్ 5వ తేదీన జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.