తక్కువ కాలంలోనే, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఓ యువతి పెద్ద ప్లాన్ వేసింది. ఒకరిని విడిచి, మరొకరు.. ఇలా నలుగురిని వివాహం చేసుకుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. కానీ ఓ భర్త ఫిర్యాదుతో చివరికి పోలీసులకు చిక్కింది.
శ్రీమంతురాలు కావాలనే ఆశ ఓ యవతి ఏ మహిళా చేయని పని చేసింది. ఏకంగా నలుగురిని వివాహం చేసుకుంది. ఒక పెళ్లి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడింది. కానీ చివరికి మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు, నలుగురు భర్తలు ఆమె చేసిన నిర్వాకం గురించి తెలిసి ఖంగుతిన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని కేటీజే పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే యువకుడు ప్రశాంత్ రెండేళ్ల కిందట రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో అతడికి 25 ఏళ్ల స్నేహ పరిచయం అయ్యింది. మండ్య జిల్లా పాండవపురకు చెందిన యువతిని అని తనను తాను పరిచయం చేసుకుంది. వీరి మధ్య పరిచయం కొంత కాలం తరువాత ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
దావణగెరె జిల్లా కేంద్రంలోని ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని అందులో కాపురం పెట్టారు. రెండు నెలల తరువాత తాను గర్భం దాల్చానని స్నేహ భర్తతో చెప్పింది. కొంత కాలం తన పుట్టింటికి వెళ్లి వస్తానని చెబితే దానికి ప్రశాంత్ ఒప్పుకున్నాడు. తరువాత ఫోన్ చేసి ఇంటికి రావాలని భర్త ఆమెను కోరాడు. కానీ దానికి స్నేహ ఒప్పుకోలేదు. తాను ఇక ఇంటికి రానని తేల్చి చెప్పింది. దీంతో అతడికి ఏం అర్థం కాలేదు.
వెంటనే స్నేహ గతంలో ఇచ్చిన అడ్రెస్ ను వెతుక్కుంటూ ఆమె పుట్టింటికి వెళ్లి చూశాడు. కానీ అక్కడ భార్య కనిపించలేదు. దీంతో కేజీజే టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. స్నేహకు ప్రశాంత్ కంటే ముందే మరో ఇద్దరిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్నారు.
తరువాత స్నేహ ఎక్కడ ఉంటుందో తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు. కానీ ఆలోపే ఆమె బెంగళూరుకు చెందిన రఘు అనే యువకుడితో నాలుగో పెళ్లి అయిపోయింది. స్నేహ వ్యవహారం అంతా అతడికి చెప్పడంతో అతడు షాక్ కు గురయ్యాడు. వాస్తవానికి ఆమెకు కొన్నేళ్ల కిందట మహేష్ అనే యువకుడితో పెద్దలు వివాహం జరిపించారు. కానీ అతడిని కొంత కాలం తరువాత స్నేహ వదిలేసింది. తరువాత బెంగళూరుకు చెందిన వెంకటేశ్ అనే యువకుడిని పెళ్లాడింది. కొంత కాలం తరువాత అతడినీ విడిచిపెట్టింది. తరువాత ప్రశాంత్ ను వివాహం చేసుకొని అదే పని చేసింది. మళ్లీ చివరిసారి రఘును వివాహమాడింది. ప్రశాంత్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.