
పంజాబ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని (narendra modi) రైతులు అడ్డుకోవడం.. ఆయన కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోవడం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీని వెనుక వున్న వారిని బయటకు లాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే మోడీ కాన్వాయ్‌కు అడ్డుపడిన నిరసనకారులకు భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) సభ్యుడు కృతజ్ఞతలు తెలుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో బీకేయూ క్రాంతికారీ నేత సుర్జీత్ సింగ్ ఫూల్ నిరసనకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ‘మోడీ ఫిరోజ్‌పూర్‌లో ర్యాలీ నిర్వహించకుండా మీ బలం అడ్డుకుంది.. ప్రధాని ప్రచార వేదిక నుంచి కేవలం 10-11 కిలోమీటర్ల దూరంలో రహదారిని నిర్బంధించగలిగాం. ఈ బీజేపీ మనమీద జల ఫిరంగులను ప్రయోగించింది. రహదారులపై మేకుల్ని ఉంచింది.. ఇప్పుడు మేం అడ్డుకున్నాం అని సుర్జీత్ అన్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
కాగా...పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం భటిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాలో ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో దాదాపు 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో.. రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని పంజాబ్ పోలీసులకు అందించారు.
దీనిపై స్పందించిన పంజాబ్ డీజీపీ.. రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సంబంధించిన అనుమతులు రావడంతో ప్రధాని భటిండా ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. గమ్యస్థానం మరో 30 నిమిషాల్లో సమీపిస్తుందనగా.. మోడీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో గానీ 100 మంది రైతులు ఆ రహదారిని దిగ్బంధించారు. దీంతో కారులోనే ప్రధాని కాసేపు వేచిచూశారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక ప్రధాని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ చేరుకున్నారు.
మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హై లెవెల్ కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్ ప్రభుత్వం (punjab govt) మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ (charanjit singh channi) . ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మ ఉన్నారు. ఇప్పటికే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah) తీవ్రంగా పరిగణిస్తున్నారు. భద్రతా వైఫల్యంపై పూర్తి నివేదిక అందించాలని పంజాబ్ అధికారులను ఆదేశించారు. భటిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక హెలికాఫ్టర్ ద్వారా వెళ్లేందుకు వాతావరణం అనుకూలించలేదనీ.. దీంతో ప్రధాని రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించారనీ అమిత్ షా తెలిపారు.
భద్రతకు సంబంధించి పంజాబ్ రాష్ట్ర డీజీపీ నుంచి అనుమతులు వచ్చాకే.. రోడ్డు మార్గంలో ప్రధాని కాన్వాయ్ ప్రారంభమైందని అమిత్ షా చెప్పారు. అధికారులు అనుమతి ఇచ్చిన తర్వాత నిరసనకారులకు ప్రధాని రూట్ మ్యాప్ ఎలా తెలిసిందన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. ప్రధాని రూట్ మ్యాప్‌ను ఎవరు లీక్ చేశారన్న దానిపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయి.