గురుగ్రామ్ లో కంఝవాలా తరహా యాక్సిడెంట్.. బైక్ ను వేగంగా ఢీకొట్టి 3 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..

By Asianet NewsFirst Published Feb 3, 2023, 9:10 AM IST
Highlights

ఓ కారు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టి, దానిని అలాగే మూడు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జు నుజ్జు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఢిల్లీలోని కంఝవాలాలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనను మర్చిపోక ముందే అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కారు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆ బైక్ ను మూడు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాలు ఇలా ఉన్నాయి.  గురుగ్రామ్‌లోని సెక్టార్ 65 పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి ఇది చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు బైక్‌పై సెక్టార్ 62 ప్రాంతం నుంచి తమ ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై వెనుక నుంచి అతివేగంతో వస్తున్న కారు బైక్‌పై వెళ్తున్న యువకులను ఢీకొట్టింది. దీంతో యువకులిద్దరూ రోడ్డున పడ్డారు. ఆ బైక్ కారు కింద ఇరుక్కుపోయింది. అయినా కూడా డ్రైవర్ కారును ఆపలేదు. 

Gurugram - Car dragged bike for 4 kms.
Bike rider collided with two youths in sector 62 pic.twitter.com/NPzK7jvdyt

— Dal Baati Churma Rajasthani Surma (@Dal_Bati_Curma)

కారు కింద బైక్ ఇరుక్కుపోయినా.. డ్రైవర్ కారును నడుపుతూనే ఉండంతో రోడ్డుపై జరిగిన ఘర్షణ వల్ల నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. ఇలా మూడు కిలో మీటర్లు ఆ బైక్ ను తీసుకెళ్లాడు. ఈ నిప్పు రవ్వలను చూసి రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. దీంతో పలువురు ఆ కారును వెంబడించారు. ఈ సమయంలో వీడియో రికార్డు చేశారు. 

కొంత దూరం తరువాత ఆ కారును నిలిపివేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వీడియో బయటకు రావడంతో బైక్‌పై వెళ్తున్న యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కారు బైక్‌ను 3 నుంచి 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినా.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం.

గత నెల 22వ తేదీన బీహార్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడిని కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు బానెట్ పై పడ్డాడు. అయినా కారు ఆగకుండా అలాగే 8 కిలో మీటర్లు అతడిని ఈడ్చుకెళ్లాడు. దీంతో బాధితుడు మరణించాడు. బీహార్ లోని తూర్పు చంపారన్ పరిసర ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బంగార గ్రామంలో 70 ఏళ్ల శంకర్ చౌదరి నివసిస్తున్నాడు. ఆయన శుక్రవారం తన సైకిల్ పై నేషనల్ హైవే నెంబర్ 28 లో కోటవా సమీపంలోని బంగార రహదారిని దాటుతున్నాడు. ఈ సమయంలో అటు నుంచి వేగంగా ఓ కారు వచ్చింది. సైకిల్ ను ఢీకొట్టింది. దీంతో ఆయన కారు బ్యానెట్ పై పడ్డాడు. అయినా డ్రైవర్ కారును ఆపలేదు. కారు ఆపాలని వృద్ధుడు అతడిని ఎంత వేడుకున్నా వినలేదు. 

కారు అలాగే 8 కిలో మీటర్లు ప్రయాణించింది. బాధితుడు బిక్కుబిక్కుమంటూ అలాగే దానిని బ్యానెట్ ను పట్టుకొని ఉన్నాడు. దీనిని గమనించిన స్థానికులు బైక్ పై కారును వెంబడించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో వృద్ధుడు మరణించాడు. దీనిపై కోటవా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. 

click me!