
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో కన్నుగీటడంపై నెటిజెన్లు ఇబ్బడి ముబ్బడిగా స్పందిస్తున్నారు. మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌తో రాహుల్‌ను పోలుస్తూ కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. మలయాళ సినిమాలోని ఓ పాటకు కన్నుకొడుతూ ప్రియా ప్రకాష్ వారియర్ ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాహుల్ చర్యను కూడా ప్రియా ప్రకాష్‌తో పోల్చుతూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. "ప్రియా ప్రకాశ్ వారియర్‌ను మరిపించావ్ రాహుల్", "ప్రియా ప్రకాశ్ వారియర్‌ను బాగా ఫాలో అవుతున్నావా రాహుల్ జీ.. ఆమె కన్నుకొట్టిన వీడియో మరిన్ని చూడండి. ఇంకా ఇంప్రూవ్ అవుతారు" అని వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రియా ప్రకాష్, రాహుల్ ఒకేలా కన్నుకొట్టారని అనుకుంటున్నారా అని అభిప్రాయం కూడా కోరుతున్నారు. "నాకు ఎంతో మధురమైన జ్ఞాపకమిది. నేను చాలా ఆనందిస్తున్నాను" అని ఇంతకు ముందు ఓ సందర్భంలో ప్రియా ప్రకాష్ చెప్పిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ ప్రసంగాన్ని శశిథరూర్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. గేమ్ ఛేజింగ్ స్పీచ్ అని ఆయన ట్విట్టర్ లో కొనియాడురు. తేజస్వి యాదవ్ కూడా రాహుల్ ప్రసంగంపైనే కాకుండా ఆయన కన్ను గీటడంపై కూడా స్పందించారు.