
SFI Trespass Into Asianet News Malayalam Channel's Office: ఏషియానెట్ న్యూస్ కొచ్చి ప్రాంతీయ కార్యాలయంలోకి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ.. బెదిరింపులకు దిగారు. "కేరళ న్యూస్ ఛానల్ కార్యాలయంలోకి చొరబడిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తల బృందం అక్కడి సిబ్బందిని బెదిరించింది. శుక్రవారం సాయంత్రం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి సిబ్బందిని బెదిరించారనీ, ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నామని" కొచ్చి పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపులను ప్రెస్ క్లబ్ ఆప్ ఇండియా ఖండించింది.
వివరాల్లోకెళ్తే.. మలయాళ న్యూస్ ఛానల్ ఏషియానెట్ న్యూస్ కొచ్చి కార్యాలయంలోకి శుక్రవారం సాయంత్రం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చొరబడి సిబ్బందిని బెదిరించారు. రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 30 మంది కార్యకర్తలు పలారివట్టంలోని కార్యాలయంలోకి చొరబడ్డారు. కార్యాలయం లోపల నినాదాలు చేస్తూ ఉద్యోగులను బెదిరించారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు. అంతకుముందు, ఏషియానెట్ న్యూస్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అసభ్యకరమైన బ్యానర్ ను కూడా పెట్టారు. ఏషియానెట్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ అభిలాష్ జీ నాయర్ ఫిర్యాదు మేరకు పలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి, కార్యాలయంలోకి చొరబడిన సీసీటీవీ ఫుటేజీ, కెమెరా ఫుటేజీలను ఫిర్యాదుతో పాటు సాక్ష్యాలుగా అందించారు.
దాడిపై ప్రెస్ క్లబ్ ఆందోళన.. కేరళ సర్కారు విచారణ జరపాలని డిమాండ్..
ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై దాడిని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఛానెల్ కార్యాలయంలోని ఇలా ప్రవేశించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఇలాంటి దాడులకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని పేర్కొంది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
కేరళ జర్నలిస్ట్స్ యూనియన్ ఆగ్రహం..
ఏషియానెట్ న్యూస్ కొచ్చి ప్రాంతీయ కార్యాలయంలోకి చొరబడి కార్యాలయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించి, ఉద్యోగులను బెదిరించిన ఎస్ఎఫ్ఐ చర్యను కేరళ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించింది. ఓ మీడియా సంస్థ కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగులను బెదిరించడం నిరసన కాదనీ, ఇది గూండాయిజమని పేర్కొంది. ప్రజాస్వామ్య విలువలకు విలువనిచ్చే కేరళ లాంటి ప్రాంతంలో ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపింది. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కేయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షురాలు ఎంవీ వినీత, ప్రధాన కార్యదర్శి ఆర్ కిరణ్ బాబు డిమాండ్ చేశారు.