2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్ ఒకదానిని మాత్రమే గెలుచుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల సమరానికి కేవలం తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు సమయం లేదు మిత్రమా.. సమరమా.. స్నేహమా.. అంటూ వ్యూహాలను రచిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ సన్నాహాలు ప్రారంభించగా.. కాంగ్రెస్ తనతో కలిసి వచ్చే పార్టీలన్నింటిని ఏకం చేసి.. సార్వత్రిక సమరంలో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలతో పాటు నేతల స్వరాలు మారుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కమలంతో చేయి కలపడానికి సిద్దమైంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయంగా మారింది. ఇదే క్రమంలో మరో ప్రాంతీయ పార్టీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇకపోతే.. కన్నడనాట కూడా అదే పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత ఘోరమైన ప్రదర్శనతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (JDS) బిజెపి వైపు మొగ్గు చూపుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని, ఈ మేరకు పార్టీ నేతలతో చర్చినట్లు తెలుస్తోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే గెలుచుకున్న JDS, అసెంబ్లీ ఎన్నికల తీర్పు వెలువడిన వారాల తర్వాత బీజేపీతో పొత్తు కోసం సిద్దమైతున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది, అధికార బీజేపీని గద్దె దించి, కింగ్‌మేకర్‌గా వ్యవహరిస్తామనుకున్నా జేడీఎస్ ఆశలపై నీళ్లు చల్లింది. 224 సీట్లలో జేడీఎస్ కేవలం 19 మాత్రమే గెలుచుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరాజయం పాలుకావడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది.
ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్, ఒకప్పటి మిత్రపక్షమైన బిజెపితో జతకడితే కాంగ్రెస్‌ను ఓడించి తన ఓట్‌బేస్‌ను కాపాడుకునే అవకాశాన్ని అంచనా వేస్తున్నట్లు సమాచారం.
20 నెలల అధికార భాగస్వామ్య ఫార్ములా ప్రకారం కుమారస్వామి ముఖ్యమంత్రిగా, BS యడియూరప్ప డిప్యూటీగా 2006లో కర్ణాటకలో BJP, JDS సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ అధికారాన్ని బీజేపీకి బదిలీ చేయకపోవడంతో సంకీర్ణానికి స్వల్పకాలానికే పరిమితమైంది. ఈ క్రమంలో జేడీఎస్ మరోసారి తన మాజీ భాగస్వామి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.