క‌ర్నాట‌క‌పై చ‌లిపులి పంజా.. బెంగ‌ళూరులో ఒక ద‌శాబ్దంలోనే అత్య‌ల్ప ఉష్ణోగ్రతలు !

By Mahesh RajamoniFirst Published Oct 26, 2022, 10:37 AM IST
Highlights

Karnataka: బెంగళూరులో ఒక దశాబ్దంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదయ్యాయి. బెంగళూరులో కనిష్టంగా 15.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ. 
 

Bengaluru-chill weather: క‌ర్నాట‌క‌పై చ‌లిపిడుగు పంజా విసురుతోంది. మ‌రీ ముఖ్యంగా బెంగ‌ళూరు, దాని స‌రిహ‌ద్దు జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు స్థాయికి ప‌డిపోయాయి. దీంతో చ‌లి వాతార‌ణం నెల‌కొంది. గత వారం వరకు భారీ వర్షాలను చూసిన కర్ణాటకలో ఇప్పుడు తీవ్రమైన శీతల వాతావరణం కనిపిస్తోంది. తీరప్రాంతం, ఉత్తర అంతర్భాగాలు, దక్షిణ అంతర్భాగంలోని చాలా ప్రాంతాలు ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదలను చవిచూశాయి. బెంగళూరులో ఒక దశాబ్దంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా  నమోదయ్యాయి. బెంగళూరులో కనిష్టంగా 15.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ. రాబోయే 3-4 రోజుల పాటు చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైంది. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ వంటి తీరప్రాంత జిల్లాలు, దక్షిణ లోతట్టు జిల్లాలైన మాండ్య, కొడగు, మైసూర్ లలో గరిష్ట ఉష్ణోగ్రతలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కాకపోతే, దక్షిణ అంతర్భాగాలు, ఉత్తర అంతర్భాగంలోని అన్ని జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రత కూడా తగ్గింది. రాష్ట్రంలో 73 శాతం కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ నుండి 16 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. కోలార్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపూర్, చిక్కమంగళూరు, హసన్, రామనగర్, తుమకూరు, బెంగళూరు సిటీ, బీదర్, విజయపూర్, కలబుర్గి, మాండ్య, కొడగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10.9 డిగ్రీల నుంచి 13 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. విజయపూర్ లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.

బెంగ‌ళూరులో ద‌శాబ్దంలోనే అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌.. 

రాష్ట్ర రాజధాని బెంగళూరులో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత 15.4 డిగ్రీల సెల్సియస్. ఇది గత పదేళ్లలో అక్టోబర్ నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత. గత పదేళ్లలో 2018 అక్టోబర్ 30న 16.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 1974 అక్టోబరు 31న అత్యల్పంగా 13.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బెంగళూరులో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ వాయుగుండం వల్ల ఉత్తర భారతదేశం నుంచి శీతల గాలులు దక్షిణ భారతదేశం వైపు వీస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం కారణంగా ద్వీపకల్ప ప్రాంతంలోని వాతావరణంలోని తేమ బంగాళాఖాతం ఈశాన్య దిశ వైపు మళ్లింది. 

మరికొన్ని రోజులు ఇలాగే.. 

ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు, మేఘాలు లేకపోవడం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ గీతా అగ్నిహోత్రి తెలిపారు. వాతావరణంలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. శీతాకాల పరిస్థితులు ఏర్ప‌డ‌తాయి. తూర్పు నుంచి గాలి వీచే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. వాతావరణ సూచన మేరకు తూర్పు కోస్తా నుంచి వీస్తున్న గాలుల తీవ్రత రెండు మూడు రోజుల్లో పెరుగుతుంది. కాబట్టి, మూడు నాలుగు రోజుల్లో, ఉష్ణోగ్రత మళ్లీ పెరుగుతుంది. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 

click me!