
న్యూఢిల్లీ : 2021 సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడిచిన ఏడు సంవత్సరాల్లో 8.5 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. మొత్తంగా 2017 నుంచి ఇప్పటి వరకు 8,81,254 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
భారత ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకోవడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్సే కారణమని కాంగ్రెస్ సీనియన్ నాయకుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఆరోపించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ పై నిందలు మోపారు. ఇంత పెద్ద సంఖ్యలో పౌరసత్వాన్ని త్యజించడానికి ఆయన నాలుగు కారణాలను పేర్కొన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, వ్యాపారం దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థ విఫలం కావడం, సామాజిక అసమానతల కారణంగా ప్రతిరోజూ 350 మంది భారత పౌరసత్వాన్ని విడిచిపెట్టారని ఖర్గే అన్నారు. ఇవి వారిని తరిమికొట్టడానికి బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం పౌరులకు ఇచ్చిన కొన్ని బహుమతులు అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా.. భారతీయులు తమ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తమకు పౌరసత్వం వద్దంటూ ఎక్కువ మంది యునైటెడ్ స్టేట్స్ నుండి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేశం తరువాత ఆస్ట్రేలియా, కెనడాలు ఉన్నాయి. అక్కడ సెటిల్ అవుదాం అనుకునే వారు ఇలా పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2019 సంవత్సరంలో మొత్తంగా 1,44,017 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు, 2020లో 85,248 మంది వదులుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సంఖ్య చాలా తగ్గిపోయింది. అయితే కొంత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ 2021లో 11,287 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని ఇవ్వనందున ఇతర దేశాలలో పౌరసత్వం కోరుకునే భారతీయులు తమ భారతీయ పాస్ పోర్ట్ ను వదులుకోవాలి. అయితే, భారతీయులు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది భారతదేశంలో నివసించడానికి, పనిచేయడానికి లేదా వ్యాపారాన్ని నడపడానికి అనుమతిస్తుంది. దీంతో పాటు పేలమైన పాస్ పోర్టు స్కోరు కూడా పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, భారతీయ పాస్ పోర్ట్ ప్రస్తుతం 85వ స్థానంలో ఉంది. ఇది 59 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ ను అందిస్తుంది. అయితే పోర్చుగీస్ పాస్ పోర్ట్ మాత్రం 187 దేశాలకు ప్రాప్యతను అందిస్తుంది.
ఇదిలా ఉండగా.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని యోచిస్తున్నందున భారత్ కు ఇది ఆందోళనకరమైన అంశమని ఇండియాలోని నేషనల్ లీడర్-టాక్స్ సుధీర్ కపాడియా అన్నారు. మన దేశంలో నివసిస్తున్న సంపన్న భారతీయుల ఇతర దేశాల్లో సెటిల్ అవ్వడానికి చూడటం, అక్కడికి వెళ్లడం ఆందోళన చెందాల్సిన విషయమని ఆయన మీడియాతో తెలిపారు.