71% ఇండియన్ పేరెంట్స్‌లో ఒలింపిక్స్ జోష్.. పిల్లలను క్రీడాకారులు చేస్తాం

By telugu teamFirst Published Aug 10, 2021, 6:27 PM IST
Highlights

భారతీయుల్లో టోక్యో ఒలింపిక్స్ సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని, తమ పిల్లలు క్రికెట్ కాకుండా ఇతర క్రీడలను కెరీర్‌గా  మలుచుకోవాలనుకుంటే అందుకు సమ్మతిస్తామని 71శాతం భారతీయులు భావిస్తున్నట్టు ఓ సర్వే వెల్లడించింది. గత ఒలింపిక్స్ క్రీడల కంటే ఈ సారి ఎక్కువ మంది భారతీయ క్రీడాకారుల ఆటలను పౌరులు గమనించినట్టు వివరించింది.

న్యూఢిల్లీ: మనదేశంలో క్రికెట్‌కు అసాధారణ క్రేజ్ ఉన్నది. పిల్లలు మొదలు వయోధికుల వరకూ దీనిపై మక్కువ చూపుతారు. అయితే, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తున్నట్టు ఓ సర్వే వెల్లడించింది. తాజాగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ గెలిచింది ఏడు పతకాలే అయినా భారతీయుల్లో సరికొత్త జోష్ నింపినట్టు తెలిపింది. 

ఒలింపిక్స్ క్రీడలపై గతంలో కంటే ఆసక్తి పెరిగిందని వివరించింది. అంతేకాదు, క్రికెట్ మినహా ఇతరక్రీడల్లో తమ పిల్లలకు ఆసక్తి ఉంటే అందుకు మద్దతునిస్తామని 71శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడినట్టు పేర్కొంది. 309 జిల్లాల్లో సుమారు 18వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించి లోకల్ సర్కిల్స్ చేపట్టిన సర్వేలో ఈ కీలక పరిణామం వెల్లడైంది.

అనాదిగా మనదేశంలోని మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలు క్రికెట్ మినహా మరో క్రీడను కెరీర్‌గా ఎంచుకోవడానికి సమ్మతించేవారు కాదు. ఆర్థిక అస్థిరత, క్రమబద్ధమైన సంపాదన ఉండదనే ఆందోళనే ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నది. కానీ, టోక్యో ఒలింపిక్స్‌తో ఇండియన్ పేరెంట్స్‌ ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయి. 71శాతం మంది భారత తల్లిదండ్రులు తమ పిల్లలు క్రికెట్ కాకుండా ఇతర క్రీడలను కెరీర్‌గా ఎంచుకున్నా అందుకు సహకరిస్తామని, అండగా ఉంటామని వెల్లడించినట్టు సర్వే వివరించింది. పది శాతం మంది ఇప్పుడే చెప్పలేమని తెలిపినట్టు పేర్కొంది. 2016 ఒలింపిక్స్ సమయంలో నిర్వహించిన సర్వేలో 40శాతం మంది తల్లిదండ్రులే పిల్లలు ఇతర క్రీడాలను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని అంగీకరిస్తామని చెప్పడం గమనార్హం.

51శాతం మంది తాము లేదా తమ కుటుంబంలోని ఇతరులు టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ఆటలను శ్రద్ధగా చూస్తున్నామని వివరించినట్టు సర్వే తెలిపింది. 47శాతం మంది మాత్రం ఒలింపిక్స్ క్రీడాలను చూడటం లేదని తెలిపినట్టు పేర్కొంది. 2016 వివరాలతో పోలిస్తే అప్పుడు కేవలం 20శాతం మంది మాత్రమే భారత క్రీడాకారుల ఆటలను చూస్తున్నట్టు వివరించారు. అంటే క్రమంగా క్రికెట్ కాకుండా ఇతర క్రీడలపై క్రమంగా ఆసక్తి పెరుగుతున్నట్టు సర్వే నిర్వాహకులు చెప్పారు. ప్రభుత్వం ఈ సానుకూల వాతావరణాన్ని క్రీడలను ప్రమోట్ చేయడానికి అవకాశం ఎంచుకోవాలని, అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

click me!