
దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోతోంది. ఒకటో, రెండో కేసులు కనిపించే రోజులు దాటిపోయి.. ఇప్పుడు ఎక్కడ చూసినా పదులు, వందల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇది మరింత భయాందోళనలకు గురి చేస్తోంది.
తాజాగా కర్ణాటక లోని ఓ గ్రామంలో ఓకేసారి ఏకంగా 70 మందికి పాజిటివ్ తేలింది. అంతేకాదు ఇంకొంతమందికి పాజిటివ్ తేలే అవకాశం ఉంది. దీంతో ఆ గ్రామం ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకుంది.
వివరాల్లోకి వెడితే కర్ణాటక కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా విన్నాళ గ్రామంలోని ఓ వార్డులో ఏకంగా 70 మందికి కరోనా పాజిటివ్ నిర్ణారణ అయ్యింది. గ్రామంలో 500 మంది ఉండగా.. వీరిలో ఇటీవల కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. అంతేకాదు వీరిలో 6,7 మంది పాజిటివ్ వచ్చింది.
దీంతో వైద్యబృందం గ్రామంలోని అందరికీ పరీక్షలు నిర్వహించారు. దీంట్లో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఏకంగా 70 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. అంతేకాదు మరికొంత మందికి పాజిటివ్ తేలే అవకాశం ఉండడంతో వైద్యబృందం షాక్ అయ్యింది.
అయితే ఒకేసారి ఇలా ఇన్ని కేసులు బయటపడడానికి కారణం.. వీరంతా ఇటీవల గదగ్ జిల్లా రోణలో జరిగిన ఓ పెళ్లికి హాజరవ్వడమే అని తెలుస్తోంది.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona