
ముంబయి: మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ఓ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న కురిసిన భారీ వర్షం, భీకర గాలులతో ఆలయం పక్కనే ఉన్న పెద్ద వేప చెట్టు కూలిపోయి ఆలయ రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు. మరో సుమారు 35 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం అకోలా జిల్లా బాలాపూర్ తహశీల్‌లోని పారాస్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి సుమారు 40 మంది భక్తులు దేవాలయానికి వచ్చారు. అకోలా జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు భీకర గాలులూ వీచాయి. ఈ సమయంలో భక్తులు బాబూజీ మహారాజ్ మందిర్ సంస్థాన్‌లో గుమిగూడారు. ఈ గాలివాన కారణంగా ఆలయ సమీపంలోనే ఉన్న భారీ వేప వృక్షం కూలిపోయింది. ఆ వృక్షం ఆలయ రేకుల షెడ్డుపై పడింది.
సుమారు 40 మంది అక్కడ గుమిగూడారని అకోలా కలెక్టర్ నీమా అరోరా తెలిపారు. 36 మందిని సజీవంగా బయటకు తేగలిగామని, నలుగురు మరణించారని వివరించారు. ఆ తర్వాత మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని అన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్నారు.
Also Read: పదేళ్ల బాలికపై అత్యాచారం.. బ్లీడింగ్ కావడంతో ప్రైవేట్ పార్టులో మట్టి, ఇసుక పోసి..!
ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మృతుల సంతాపం ప్రకటించారు. కలెక్టర్, ఎస్పీ స్పాట్‌కు చేరుకున్నారని, వారితో తాము టచ్‌లో ఉన్నామని వివరించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని సీఎం ఏక్‌నాథ్ షిండే నిర్ణయించినట్టు తెలిపారు.