
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పాటియాలీ కొత్వాలి ప్రాంతంలోని మెయిన్‌పురి బదౌన్ హైవేపై అశోక్‌పూర్ సమీపంలో ఆటో మరియు బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక, మృతులంతా ఆటోలో ప్రయాణిస్తున్నవారేనని సమాచారం. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలంచారు.
ఫరూఖాబాద్ జిల్లాలోని చిలోలి గ్రామానికి చెందిన భక్తలు.. పాటియాలీలోని బహదూర్ నగర్‌లో బోలే బాబా ఆశ్రమానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను అశోక్‌పూర్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనం ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఇక, పాటియాలీలోని బహదూర్ నగర్‌లో బోలే బాబా ఆశ్రమం ఉంది. ప్రతి మంగళవారం ఇక్కడ సత్సంగం జరుగుతుంది. సత్సంగంలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి బాబా అనుచరులు వస్తుంటారు.
ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి.. సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.