Azaan row : యూపీ మాదిరిగానే ఢిల్లీలోనూ లౌడ్ స్పీకర్లను తొలగించాలి.. కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ లేఖ‌

Published : May 03, 2022, 01:43 PM IST
Azaan row : యూపీ మాదిరిగానే ఢిల్లీలోనూ లౌడ్ స్పీకర్లను తొలగించాలి.. కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ లేఖ‌

సారాంశం

యూపీ ప్రభుత్వం మాదిరిగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా కోరారు. ఈ మేరకు ఆయన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. 

మహారాష్ట్రలో మొద‌లైన లౌడ్ స్పీకర్ ల వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది. రాజధానిలోని మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ  ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా అర‌వింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. ఈ లేఖ‌లో ఆయ‌న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు. దీంతో పాటు సామాన్యుల ఇబ్బందులను కూడా ప్ర‌స్తావించారు.

సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న మతపరమైన సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, యూపీ త‌ర‌హాలోనే ఢిల్లీలోనూ లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించాల‌ని బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా సీఎం రవింద్ కేజ్రీవాల్ ను కోరారు. శబ్ద కాలుష్యం కారణంగా విద్యార్థులు, శ్రామిక వర్గంతో పాటు సమాజంలోని వివిధ వర్గాలు ప్ర‌తీ రోజూ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాయని ఆయ‌న తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న హిందీలో ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉండగా సోమవారం బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ.. లౌడ్ స్పీక‌ర్ల విష‌యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించే మతపరమైన సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను, నగరంలోని వివిధ పౌర సంఘాలను కోరారు. “ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం అన్ని మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను తీసివేయాలి లేదా నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌క్కువ స్థాయిలో సౌండ్ ను ఉంచాలి. దీంతో ఆ ప్రాంతంలో మాత్రమే సౌండ్ వినిపిస్తుంది. శాంతికి విఘాతం కలగదు. ముఖ్యంగా విద్యార్థులకు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు, ద‌గ్గ‌ర‌లో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది ఏర్ప‌డ‌దు.” అని ఎంపీ ఢిల్లీ గ‌వ‌ర్న‌ర్ తో పాటు మూడు మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను సరిగ్గా పాటించిందని, ఇతర రాష్ట్రాలు కూడా అదే విధంగా చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయ‌కుడు తెలిపారు. ప్రజల‌కు శాంతియుత వాతావరణం నెలకొనేందుకు యూపీ ప్రభుత్వ తరహాలో సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని కోరుతున్నామ‌ని వర్మ తన లేఖలో పేర్కొన్నారు. ఓ ట్వీట్‌లో మతపరమైన ప్రదేశాలలో లౌడ్‌స్పీకర్ల వాల్యూమ్‌ను పెంచుతున్నారని దాని వల్ల “సామరస్యం” దెబ్బతింటుందని ఆరోపించారు.

కాగా 2015 సంవ‌త్స‌రంలోనే సుప్రీంకోర్టు లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించి నిబంధనలను జారీ చేసింది. వీటిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించింది. అయితే పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో వాటిని ఉపయోగించవచ్చు.

లౌడ్ స్పీక‌ర్ల వివాదాన్ని మొద‌ట‌గా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే మొదలు పెట్టారు. మసీదుల వద్ద ఆజాన్ కోసం ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. లౌడ్ స్పీక‌ర్ల‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లౌడ్ స్పీకర్ల సమస్య మతపరమైనది కాదని, అది ప్రజల సమస్య అని థాకరే అన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయ‌న ఈ విధంగా వ్యాఖ్య‌లు చేశారు. మే 3వ తేదీ నాటికి లౌడ్ స్పీక‌ర్లను తొల‌గించాల‌ని ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న డిమాండ్ చేశారు. లేక‌పోతే హిందువులు ఈ ధార్మిక ప్రదేశాల్లో హనుమాన్ చాలీసాను పారాయ‌ణం చేస్తార‌ని తెలిపారు. అయితే మే 3న జరగాల్సిన మహా ఆరతిని ఆయన రద్దు చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?