పోలీసు కస్టడీలో 669 మరణాలు : పార్ల‌మెంట్ లో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్

By Mahesh RajamoniFirst Published Feb 9, 2023, 9:16 AM IST
Highlights

NEW DELHI: జాతీయ మానవ హక్కుల కమిషన్ అందించిన డేటాను ఉటంకిస్తూ పోలీసు కస్టడీలో మరణాల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్ల‌మెంట్ కు స‌మాచారం అందించారు. గ‌త ఐదేండ్ల‌లో పోలీసు క‌స్ట‌డీలో 669 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని తెలిపారు.
 

Death Cases In Police Custody in India:  దేశంలో పోలీసులు క‌స్ట‌డీ మ‌ర‌ణాలు పెరుగుతున్నాయ‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ అందించిన డేటాను ఉటంకిస్తూ పోలీసు కస్టడీలో మరణాల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్ల‌మెంట్ కు స‌మాచారం అందించారు. గ‌త ఐదేండ్ల‌లో పోలీసు క‌స్ట‌డీలో 669 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. గత ఐదేళ్లలో భారతదేశంలో పోలీసు కస్టడీలో 650 మందికి పైగా మరణించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పార్లమెంట్ కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 669 పోలీసు కస్టడీ మరణాలు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు తెలిపారు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు ఈ మరణాలు సంభవించాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) అందించిన డేటాను ఉటంకిస్తూ మంత్రి నిత్యానంద రాయ్ సభలో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. 

పోలీసు కస్టడీ మ‌ర‌ణాలు ఇలా..

దేశంలో పోలీసు కస్టడీ మ‌ర‌ణాల గురించి మంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం, 2021-2022 మధ్య పోలీసు కస్టడీలో మొత్తం 175 మరణాలు నమోదయ్యాయి. ఇక 2020-2021లో 100 మంది, 2019-2021లో 112 మంది, 2018-2019లో 136 మంది, 2017-2018లో 146 మంది పోలీసు క‌స్ట‌డీలో చనిపోయారు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు పోలీసు కస్టడీలో మరణించిన ఘటనల్లో 201 కేసుల్లో రూ.5,80,74,998 ఆర్థిక ఉపశమనం, ఒక కేసులో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్చార్సీ) సిఫారసు చేసిందని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. మానవ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయ‌న స్పష్టం చేశారు.

మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ విష‌యంలో సలహాలు ఇస్తుందనీ, ప్రభుత్వోద్యోగులు చేసే మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్చార్సీ), రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేయాలని 1993 నాటి మానవ హక్కుల చట్టం (పీహెచ్ఆర్)ను కూడా రూపొందించిందని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనపై జాతీయ మానవ హ‌క్కుల క‌మిష‌న్ కు ఫిర్యాదులు వచ్చినప్పుడు, మానవ హక్కుల చట్టం కింద నిర్దేశించిన నిబంధనల ప్రకారం కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

ఇదిలావుండ‌గా, అసోం మానవ హక్కుల కమిషన్ 2021 లో నకిలీ ఎన్కౌంటర్ లో దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చంపిన కేసులో ఇద్దరు అధికారులను బుధవారం నాడు దోషులుగా నిర్ధారించింది. రెండు నెలల్లో బాబు భార్యకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని, ఇద్దరు అధికారులను శిక్షించాలని జనవరి 24న జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2021 ఆగస్టు 11న పోలీసు కస్టడీలో ఉండగా మహ్మద్ ఆశా బాబు మృతి చెందినట్లు దర్రాంగ్ జిల్లాలోని ఖరుపెటియా పోలీస్ స్టేషన్ పోలీసు సూపరింటెండెంట్ కు సమాచారం అందడంతో మానవ హక్కుల సంఘం ఈ కేసును చేపట్టింది. 

click me!